
- కాళేశ్వరం కమిషన్ నివేదికలో స్మితాపై చర్యలు తీసుకోవాలని సిఫార్సులు
- స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా కాత్యాయని దేవీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ ఆరు నెలల చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం 2025 ఆగస్టు1 నుంచి 2026 జనవరి 31 వరకు లీవ్‌ను మంజూరు చేసింది. స్మితా సబర్వాల్ స్థానంలో ఐఏఎస్ కాత్యాయని దేవీని మెంబర్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో సీఎంఓ అడిషనల్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా పలు కీలక అంశాల్లో ముఖ్య పాత్ర పోషించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ఇచ్చిన నివేదికలో కూడా స్మితా సబర్వాల్‌పై చర్యలకు సిఫార్సు చేసింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించబోతున్న నేపథ్యంలో ఆమె సెలవు తీసుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. సెలవు జీవో మంజూరు తరువాత స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ''గత కొన్ని నెలలుగా ఆరోగ్య పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నానని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. వెన్నుపూస నరం చీలికతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో నిశబ్దమైన సమయమే.. అసలైన పరిస్థితులను తెలియజేస్తాయి'' అని పేర్కొన్నారు.