రాష్ట్రానికి 9 జాతీయ పంచాయతీ పురస్కారాలు

రాష్ట్రానికి 9 జాతీయ  పంచాయతీ పురస్కారాలు

అందజేసిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

న్యూఢిల్లీ, సిద్దిపేట రూరల్‌, వెలుగు: జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలు పలు అంశాల్లో మొదటి స్థానంలో నిలిచాయి. 2019 సంవత్సరానికిగానూ వివిధ విభాగాల్లో రాష్ట్రానికి 9 జాతీయ పంచాయతీ పురస్కారాలు వచ్చాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. 2017-18 సంవత్సరానికి గానూ పంచాయ‌తీలు, మండ‌లాలు, జడ్పీలలో అత్యుత్తమ సేవ‌లు, శానిటేష‌న్ నిర్వహ‌ణ‌, డ్రైనేజీ నిర్వహణ త‌దిత‌ర అంశాలను పరిశీలించి కేంద్రపంచాయ‌తీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. జగిత్యాల జిల్లా పైడిమడుగు గ్రామానికి బాల్యమిత్ర పంచాయతీ పురస్కారం, పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌కు నానాజీ దేశ్‌ముఖ్ జాతీయ గౌరవ గ్రామ పురస్కారం వచ్చాయి. జిల్లా విభాగంలో ఆదిలాబాద్, ఇంటర్ మీడియెట్ పంచాయితీల విభాగాల్లో కరీంనగర్‌లోని మంథని, వెల్గటూరు మండలాలకు పురస్కారాలు దక్కాయి. శానిటేషన్ విభాగంలో మెదక్ జిల్లా మల్కాపూర్, పెద్దపల్లి జిల్లాలోని మల్లారం గ్రామ పంచాయితీలు అవార్డులు పొందాయి. సోషల్ సెక్టార్ డెవలప్మెంట్ విభాగంలో సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ పంచాయితీకి ప్రత్యేక పుర‌స్కారం ల‌భించింది. నిజామాబాద్ జిల్లాలోని నాగపూర్ గ్రామానికి సాధారణ విభాగంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారం దక్కింది. కేంద్ర మంత్రి తోమర్  చేతుల మీదుగా ఆయా ప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా వీటిని అందుకున్నారు.

ఐక్యతకు నిదర్శనం ఇర్కోడ్: మంత్రి హరీశ్‌

పల్లె అభివృద్ధి చెందాలి అంటే ప్రజల భాగస్వామ్యం, ఐక్యతతోనే సాధ్యమని అందుకు నిదర్శనం ఇర్కోడ్ గ్రామమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జాతీయ స్థాయి అవార్డు అందుకున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.