పంచాయతీ ఎన్నికలకు రెడీ.. ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల

పంచాయతీ ఎన్నికలకు రెడీ.. ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల
  •      మెజార్టీ ఓటర్లు మహిళలే 
  •      ఈ నెల 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల ముసాయిదా

మహబూబ్​నగర్​, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్​ వెలువడే చాన్స్​ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు.. ఆతర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. 

మహిళా ఓటర్లే అధికం..

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించి మంగళవారం గ్రామ పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు. వార్డుల వారీగా పోలింగ్​ స్టేషన్​లు, ఓటర్ లిస్టు జీపీల్లో ప్రదర్శించారు. రెండు జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. నారాయణపేట జిల్లాలో పురుష ఓటర్లు 1,94,124 మంది కాగా, మహిళా ఓటర్లు 2,02,410 మంది ఉన్నారు. మహబూబ్​నగర్​ జిల్లాలో పురుష ఓటర్లు 2,48,217 మంది ఉండగా, మహిళలు 2,51,344 మంది ఉన్నారు. 

నారాయపేట జిల్లాలోని మొత్తం 13 మండలాల్లోనూ మగవాళ్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ. మహబూబ్​నగర్​ జిల్లాలో 16 మండలాలు ఉండగా బాలానగర్​, కోయిల్​కొండ, నవాబుపేట, మహమ్మదాబాద్ మండలాలు మినహా అంతటా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ​ మహమ్మదాబాద్​ మండలంలో 15,645 మంది పురుషులుండగా.. 15,644 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మహిళలకంటే ఒక్క పురుష ఓటరే ఎక్కువగా ఉన్నారు. 

6న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల ముసాయిదా జాబితా

 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల తుది జాబితాకు నోటిఫికేషన్​ విడుదల చేశారు. ఈ నెల 6న ముసాయిదా ఓటరు లిస్ట్​ ప్రదర్శించనున్నారు. 8న ఎంపీడీవో ఆఫీసుల్లో అన్ని పొలిటికల్​ పార్టీల ప్రతినిధులతో మీటింగ్​ ఏర్పాటు చేస్తారు. 8 నుంచి 10 వ తేదీ వరకు మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. 10న సాయంత్రం ఎంపీటీసీ, జడ్పీటీసీ తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. 

సైలెన్స్​ మోడ్​లో లీడర్లు

ఓ దిక్కు పంచాయతీ ఎన్నికల సన్నాహాలు జరుగుతుండగా మండల, గ్రామ స్థాయి లీడర్ల హడావుడి పెద్దగా కనిపించడం లేదు. నెల రోజుల నుంచే లోకల్​బాడీ ఎన్నికలకు సంబంధించి జోరుగా చర్చలు జరుగుతున్నా లీడర్లు సైలెంట్​గా ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. దీంతో టికెట్లు పాతవారికి దక్కుతాయా.. కొత్తవాళ్లకు ఇస్తారా అన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో నెలకొంది. దాదాపు అన్నిచోట్ల ఎంపీటీసీ, సర్పంచు స్థానాలకు ఇద్దరు, ముగ్గురు లీడర్ల పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ టికెట్ కన్ఫాం చేశాకే ఓటర్లను కలవాలని లీడర్లు అనుకోవడంవల్ల ఇంకా పల్లెల్లో సందడి మొదలుకాలేదని తెలుస్తోంది.