
- వాటి స్థానంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ విధానం
- ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ మెయిన్ ఆఫీస్‌కు అనుసంధానం
- పర్మిట్లు, మిగిలిన అనుమతులన్నీ ఆన్లైన్లోనే..
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మొత్తం 15 ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ట్రాన్స్‌పోర్టు అధికారులు చెక్ పోస్టుల స్థానంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) అనే అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే, ప్రస్తుతం డ్యూటీ చేస్తున్న సిబ్బందికి కొత్త బాధ్యతలు అప్పగించాకే చెక్ పోస్టులను పూర్తి స్థాయిలో ఎత్తేస్తారు.
అయితే, ఏ తేదీ నుంచి అధికారికంగా చెక్ పోస్టులను ఎత్తేయనున్నారనేది త్వరలోనే ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ విధానం అమల్లోకి తీసుకొస్తారు. ఈ అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న ప్రధాన రవాణా శాఖ ఆఫీస్‌కు అనుసంధానమై ఉంటుంది. దీంతో రవాణా శాఖలో పారదర్శకత స్పష్టంగా కనిపించనున్నది.
ఏ వెహికల్ అయినా కెమెరా కండ్లుగప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వస్తే.. వాటిని జాతీయ రహదారులపై అడ్డుకొని చర్యలు తీసుకునేందుకు వీలుగా మొబైల్ స్క్వాడ్ లను కూడా రంగంలోకి దింపనున్నారు. ఈ వ్యవస్థపై ముందుగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వాహన యజమానుల అసోషియేషన్ కు ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్‌తో పాటు సరకు రవాణా వాహనాల పర్మిట్లు, మిగిలిన అనుమతులన్నీ ముందే ఆన్ లైన్ లో పొందేలా రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతుల్లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
15 చెక్‌పోస్టుల వద్ద 70 మంది సిబ్బంది
ఇప్పటి వరకు 15 చెక్ పోస్టుల వద్ద విధుల్లో ఉన్న సుమారు 70 మంది ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఇతర సిబ్బందిని ప్రస్తుతం రవాణా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారులపై రవాణా సమస్యలు లేకుండా, సాఫీగా ప్రయాణం జరిగేందుకు వీలుగా చెక్ పోస్టులను ఎత్తేయాలని గతంలోనే కేంద్రం ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.