ఆ 16 ప్రాజెక్టులపై కదలికేదీ.?..జీవో ఇచ్చి 5 నెలలైతున్నా ముందుకు పడని అడుగు

ఆ 16 ప్రాజెక్టులపై  కదలికేదీ.?..జీవో ఇచ్చి 5 నెలలైతున్నా ముందుకు పడని అడుగు
  •     
  •     360 టీఎంసీల కెపాసిటీతో 16 ప్రాజెక్టులు చేపట్టేందుకు నిరుడు సెప్టెంబర్​లోనే నిర్ణయం.. డీపీఆర్​, సర్వే చేయాలని ఉత్తర్వులు
  •     ఇంతవరకూ గ్రౌండ్​లో మొదలుకాని ప్రాథమిక పనులు
  •     అడ్మినిస్ట్రేటివ్​ అప్రూవల్స్​ కూడా లేట్​
  •     డీపీఆర్​లు ప్రిపేర్​ చేస్తే నీటి వినియోగ హక్కులకు డిమాండ్​ చేసే చాన్స్​
  •     ట్రిబ్యునల్​లో మన వాదనలకు మరింత బలం చేకూరుతుందనే చర్చ

హైదరాబాద్​, వెలుగు:  కృష్ణా జలాల్లో  తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యలు స్లోగా సాగుతున్నాయి. ఉమ్మడి ఏపీలో కృష్ణాపై కొత్త ప్రాజెక్టులు కట్టడం కాదు కదా.. ఉన్న ప్రాజెక్టుల కెపాసిటీ పెంచే ప్రయత్నాలు జరగలేదు. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ ప్రభుత్వమూ ఆ దిశగా ఆలోచన చెయ్యలేదు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ.. కృష్ణా నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఓ మంచి ఆలోచన చేసింది. దాదాపు 360 టీఎంసీల వినియోగాన్ని చూపించేలా పలు రిజర్వాయర్లకు ప్రణాళికలు వేసింది. అందుకు అనుగుణంగానే 16 ప్రాజెక్టులు/రిజర్వాయర్లు చేపట్టేందుకు నిరుడు సెప్టెంబర్​ 16నే జీవో 34 కూడా రిలీజ్​ చేసింది. డిటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్​ (డీపీఆర్​), సర్వే పనులు పూర్తి చేయాలని ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఆ అడుగు అక్కడే ఆగిపోయింది. జీవో ఇచ్చి దాదాపు ఐదు నెలలైతున్నా.. దానికి సంబంధించి పనులకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కేవలం జీవో ఇచ్చి పక్కనపెట్టారన్న చర్చ ఇరిగేషన్​ వర్గాల్లో జరుగుతున్నది. ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన జూరాల ఫ్లడ్​ ఫ్లో కెనాల్​ ఒకటి. 100 టీఎంసీలు తరలించుకునేలా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. వీటిలో మహబూబ్​నగర్​ జిల్లాలో కరువు ప్రాంతాలకు నీళ్లిచ్చేందుకు 123 టీఎంసీల సామర్థ్యంతో కోయిల్​కొండ –గండీడ్​ లిఫ్ట్​, రేలంపాడు రిజర్వాయర్​ కెపాసిటీ పెంపు, ఎస్​ఎల్​బీసీ ఎక్స్​టెన్షన్​, కల్వకుర్తి ఎక్స్​టెన్షన్​ వంటి ప్రాజెక్టులున్నాయి.

హక్కులు సాధించే చాన్స్​

ఉమ్మడి ఏపీకి బచావత్​ ట్రిబ్యునల్​ కృష్ణాలో 811 టీఎంసీల జలాలను కేటాయించింది. రాష్ట్రం ఏర్పడ్డాక ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించేలా నాటి కేసీఆర్​సర్కారు తాత్కాలిక ఒప్పందం చేసుకుంది. ట్రిబ్యునల్​ కేటాయింపులు జరిగేవరకు  ఏటా అవే కేటాయింపులు జరిగేలా గత ప్రభుత్వం కేంద్రానికి ఓకే చెప్పడం వివాదాస్పదమైంది. కాగా, ఈ పరిస్థితిని మార్చే క్రమంలో నీటి వినియోగాన్ని పెంచేందుకు కాంగ్రెస్​ సర్కారు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఈ 16 ప్రాజెక్టులను చేపడితే.. నీటి వినియోగాన్ని చూపించుకునే ఆస్కారం ఉంటుందని భావించింది. వాటి డీపీఆర్​లు పూర్తయితే నీటి హక్కుల కోసంట్రిబ్యునల్​ వాదించేందుకు ఈ ప్రాజెక్టులు చాలా వరకు బలం చేకూరుస్తాయని అధికారులూ అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదు. డీపీఆర్​ తయారీ, సర్వేల కోసం ప్రభుత్వం నుంచి కూడా అడ్మినిస్ట్రేటివ్​ అప్రూవల్స్​ రావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేటివ్​ అప్రూవల్స్​ వస్తే.. క్షేత్రస్థాయిలో పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీటింగులు పెడుతున్నా.. రివ్యూ జరగట్లే..

రాష్ట్రంలోని ఇరిగేషన్​ ప్రాజెక్టుల మీద రెగ్యులర్​గా మంత్రి వద్ద రివ్యూలు జరుగుతున్నాయి. సీఎం వద్దకూడా అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. కానీ, రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకునేందుకు.. ముంగటేసుకున్న ఇంత ముఖ్యమైన ప్రాజెక్టులపై మాత్రం చర్చ జరగడం లేదన్న  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం నల్లమలసాగర్​ కేసు, ఎస్​ఎల్​బీసీ పనులు, కాళేశ్వరం పునరుద్ధరణతో పాటు పలు ఇతర ప్రాజెక్టులపై చర్చిస్తున్నా.. ఈ 16 ప్రాజెక్టులపై మాత్రం సీరియస్​గా చర్చలు జరగడం లేదని చెబుతున్నారు. ఇటు అధికారులు కూడా ఆ ప్రాజెక్టులపై ఏం చేద్దామనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్​నగర్​, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోనే ఈ ప్రాజెక్టులున్నాయి. అవి పూర్తయితే ఆయా జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. 

ఇవీ ఆ 16 ప్రాజెక్టులు..


1. రేలంపాడు బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​ కెపాసిటీ 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంపు.
2. గట్టు బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​ కెపాసిటీ 1.32 టీఎంసీల నుంచి 5 లేదా 10 టీఎంసీలకు పెంపు.
3. 25 వేల ఎకరాలకు అదనపు ఆయకట్టుకు 4 టీఎంసీల నీళ్లు ఇచ్చేందుకు జవహర్​ నెట్టెంపాడు లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​ ఫేజ్​ 2. 
4. పులిచింతల ఫోర్​షోర్​ నుంచి వేములూరు వాగుపై 0.5 టీఎంసీల సామర్థ్యంతో బొజ్జా తండా-భీమా తండా లిఫ్ట్​ స్కీమ్​. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలంలోని 3 గ్రామాల్లో ఉన్న 1380 ఎకరాలకు సాగు నీరందించే ప్లాన్​.
5. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​  స్కీమ్​ ఫేజ్​ 2. 93,531 ఎకరాల అదనపు ఆయకట్టును సృష్టించేలా శ్రీశైలం నుంచి 13 టీఎంసీలను లిఫ్ట్​ చేసేందుకు చేపట్టే ఫేజ్​ 2లో కెనాల్స్​, హెడ్​వర్క్స్​ పనులు. దాంతో పాటు తాగునీటి కోసం 7.12 టీఎంసీలు. 
6. వరద రోజుల్లో రోజూ 2 టీఎంసీల చొప్పున వంద టీఎంసీలు తరలించేలా జూరాల ఫ్లడ్​ ఫ్లో కెనాల్​. నల్గొండ, వరంగల్​, మహబూబ్​నగర్​, ఖమ్మం జిల్లాల్లో 11.3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. 
7. మహబూబ్​నగర్​ జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటి కోసం 123 టీఎంసీల తరలింపునకు కోయిల్​కొండ–గండీడ్​ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​. జూరాల ఆధారంగా చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా కోయిల్​కొండ రిజర్వాయర్​ 45 టీఎంసీలు, గండీడ్​ రిజర్వాయర్​ 35 టీఎంసీలు, దౌల్తాబాద్​ రిజర్వాయర్​ 43 టీఎంసీలను నిర్మించనున్నారు. 
8. 3.30 టీఎంసీల నీటిని వాడుకునేలా కోయిల్​సాగర్​ లిఫ్ట్​ స్కీమ్​ సామర్థ్యం పెంపు. అదనంగా 13500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు. 
9. మహబూబాబాద్​ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 11,250 ఎకరాలకు నీళ్లిచ్చేలా జయపురం వద్ద ఆకేరు నదిపై 2 టీంఎసీలతో ఆకేరు బ్యారేజ్​
10. మహబూబాబాద్​ జిల్లా విస్సంపల్లిలో ఆకేరు నదిపై 1.2 టీఎంసీల వినియోగానికి బ్యారేజీ నిర్మాణం. 11,799 ఎకరాలకు నీళ్లు. 
11. మహబూబాబాద్​ జిల్లా ఏదులపూసపల్లి వద్ద మున్నేరు నదిపై మున్నేరు బ్యారేజీ. 13201 ఎకరాలకు నీళ్లిచ్చేలా 1.3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం. 
12. మహబూబాబాద్​ జిల్లా ముల్కనూరు వద్ద మున్నేరు నదిపై మున్నేరు బ్యారేజీ. 11,871 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు 1.2 టీఎంసీలతో బ్యారేజ్
13. మహబూబాబాద్​ జిల్లా ముల్కపల్లి వద్ద 25 నుంచి 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్​
14. ఖమ్మం జిల్లా ఏదులచెరువు వద్ద ఆకేరు నదిపై బ్యారేజ్​. 13,129 ఎకరాలకు నీళ్లిచ్చేలా 1.3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం. 
15. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.99 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా 35 టీఎంసీల
వినియోగానికి ఎస్​ఎల్​బీసీ కెనాల్​
ఎక్స్​టెన్షన్​. రోజూ ఒక టీఎంసీ చొప్పున తరలించేలా నిర్మాణం.  
16. హైదరాబాద్​ సిటీతో పాటు రీజినల్​ రింగ్​ రోడ్​ ప్రాంతంలో తాగు నీటి అవసరాల కోసం 30 టీఎంసీల సామర్థ్యంతో మూడు రిజర్వాయర్లు. దేవులమ్మ నాగారం, దండు మైలారం, ఆరుట్లల్లో 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం.