ఉద్యోగులకు ఫిట్​మెంట్​ 25శాతంలోపే?

ఉద్యోగులకు  ఫిట్​మెంట్​ 25శాతంలోపే?
  • వచ్చేవారం సీఎంకు కమిటీ రిపోర్టు
  • పీఆర్సీ కమిటీతో వరుసగా ఆర్థికశాఖ ఆఫీసర్ల భేటీ
  • తక్కువగా సిఫారసు చేసేలా సూచనలు!
  • దానిపై రెండు, మూడు శాతం పెంచి ఇచ్చే ఆలోచన
  • రిటైర్మెంట్​ ఏజ్​ 60ఏండ్లకు పెంపు!
  • సీపీఎస్ రద్దుపై అధ్యయన కమిటీ వేసే చాన్స్

ఉద్యోగులకు 25శాతంలోపే ఫిట్​మెంట్​ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్​ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారమే ఎంత శాతం సిఫారసు చేయాలన్న దానిపై పీఆర్సీ కమిటీకి ముందుగానే ప్రభుత్వం సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. రెండుమూడు రోజులుగా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్​ ఉన్నతాధికారులు కమిటీతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, వెలుగు:

పీఆర్సీ ఆఫీస్​(బుద్ధభవన్)కు గురువారం ఆర్థికశాఖలోని ఓ కీలక అధికారి వచ్చారు. సుమారు గంటన్నర పాటు కమిటీతో భేటీ అయ్యారు. పీఆర్సీ ఆఫీసులో ఆయన ఉన్నంత సేపు బయట షటర్స్ అన్నీ మూసేశారు. ఎవరినీ లోపలికి అనుమతించలేదు. నివేదిక ఎలా ఉండాలనే దానిపై ఆ అధికారి కమిటీకి సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సిఫారసులు ఉండాలనే అంశాన్ని ప్రధానంగా ఆయన సూచించినట్లు సమాచారం. ఆర్థిక మాంద్యం కారణంగా బడ్జెట్​ను కుదించినట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. పీఆర్సీని కూడా అదే కారణంతో కుదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫిట్​మెంట్​ 43 శాతం ఇచ్చిన రాష్ట్ర సర్కార్​ ఈ సారి మాత్రం 25 శాతంలోపే ఇచ్చే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. వచ్చేవారం  సీఎం కేసీఆర్​కు పీఆర్సీ కమిటీ నివేదికను అందజేయనుంది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం సమావేశమై.. ఫైనల్​ ఫిట్​మెంట్​ ఎంత అనేది అధికారికంగా ప్రకటించే చాన్స్​ ఉంది.

సిఫారసులకు అటూ ఇటుగా..

తెలంగాణ తొలి పే రివిజన్ కమిషన్ 2018 మేలో ఏర్పడింది. దీనికి ఐఏఎస్ రిటైర్డ్​ అధికారి సీఆర్ బిశ్వాల్ చైర్మన్ గా, ఐఏఎస్ రిటైర్డ్​అధికారులు ఉమామహేశ్వర్ రావు, రఫత్ అలీ సభ్యులుగా నియమితులయ్యారు. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు విధించారు. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, వరుసగా లోక్​సభ ఎన్నికలు, లోకల్  బాడీ ఎన్నికలు రావడంతో  ఫిట్​మెంట్​ అంశం పెండింగ్​లో పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కు వెళ్లడంతో మళ్లీ అది తెరమీదికి వచ్చింది. ఆర్టీసీ సమ్మె కు సంఘీభావం తెలిపేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమవగా.. వారిని పిలిచి సీఎం మాట్లాడారు. ఫిట్​మెంట్​ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. నిజానికి 2018 జులై 1 నుంచి కొత్త పీఆర్సీని అమలు చేయాలి. ఇప్పటికే  ఏడాదిన్నర ఆలస్యమైంది. ఎక్కువ శాతం ఫిట్​మెంట్ కోసం సిఫారసు చేయకుండా పీఆర్సీ కమిటీకి ముందస్తుగానే ప్రభుత్వం సూచనలు చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిటీ సిఫారసు కంటే  తక్కువ ఫిట్​మెంట్ ప్రకటిస్తే ఉద్యోగుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కమిటీతో తక్కువ సిఫారసు చేయించే ప్రయత్నం జరుగుతున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు.

‘పీఆర్సీ కమిటీ 17 నుంచి 19 శాతం వరకు సిఫారసు చేసే అవకాశం ఉంది. దాన్ని సీఎం రెండుమూడు శాతం పెంచి 20 నుంచి 21శాతంగా చేసే చాన్స్ ఉంది. అయినా ఉద్యోగులు సంతృప్తి చెందరని అనుకుంటే చివరికి 25శాతం వరకు ఫైనల్​ చేయొచ్చు’ అని ఆ అధికారి వివరించారు.

ఒక్కో శాతం  ఫిట్​మెంట్ కు రూ. 220 కోట్ల భారం

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు 2.95 లక్షలు, పెన్షనర్లు 2.45 లక్షల మంది ఉన్నారు. బడ్జెట్​లో సుమారు 45 శాతం కేటాయింపులు జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు సరిపోతున్నాయి. ఈ కేటాయింపులు 50 శాతం దాటితే ఆర్థిక పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని ఆర్థికశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫిట్​మెంట్​ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనా వేసుకుని ప్రకటించే చాన్స్​ ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఒక్క శాతం ఫిట్​మెంట్ అమలు చేస్తే ఖజానాపై సుమారు రూ. 220 కోట్ల భారం పడుతుంది. ‘గతంలో 43 శాతం ఫిట్​మెంట్​ ఇచ్చాం. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరం. ఇప్పటికే రైతు బంధు పథకానికి నిధులు లేవు. ప్రస్తుతం రెండు మూడు వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి’ అని ఆర్థికశాఖలోని ఓ అధికారి చెప్పారు. సీఎం 25 శాతం ఫిట్​మెంట్ అమలు చేస్తే ప్రభుత్వంపై ఏటా  రూ. 5,500 కోట్ల భారం పడనుంది.

సీపీఎస్ రద్దుపై అధ్యయన కమిటీ!

తక్కువ శాతం ఫిట్​మెంట్ ఇస్తే ఉద్యోగులు సంతృప్తి చెందడం కష్టమనే అభిప్రాయానికి సీఎం వచ్చినట్లు అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకని ఎన్నికల హామీ ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్​ వయసును 58 నుంచి 60 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకునే చాన్స్​ ఉన్నట్లు తెలిసింది. ఇక సీపీఎస్ రద్దు అంశంపై అధ్యయన కమిటీని వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీపీఎస్​ రద్దు కోసం గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అది సాధ్యం కాదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయినా ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. సీపీఎస్​ రద్దు అంశం వల్లే అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఓటు వేశారన్న అనుమానం కొందరు టీఆర్ఎస్ నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో   సీపీఎస్ రద్దు కోసం ఒక అధ్యయన కమిటీ వేసి సాధ్యసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని కోరే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ముందుగా ఐఆర్ ప్రకటన?

 ఫిట్​మెంట్​ను నేరుగా ప్రకటించకుండా ముందుగా ఐఆర్ (మధ్యంతర భృతి)  ప్రకటించే అంశంపైనా ఒక దశలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తక్కువ ఫిట్​మెంట్ ఇస్తే విమర్శలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకని పీఆర్సీ నివేదిక రాగానే ముందుగా ఐఆర్​ ప్రకటిస్తే ఎలా ఉంటుందని అధికారులతో సీఎం అన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఒక డీఏ ప్రకటించామని, వెంటనే  ఫిట్​మెంట్​ ఇవ్వకపోతే ఏమవుతుందని, ముందుగా 12 నుంచి 15 శాతం వరకు ఐఆర్ ఇచ్చి.. వచ్చే ఏడాది జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఫిట్​మెంట్​ అమలు చేస్తే ఎట్లా ఉంటుందని ఇటీవల ఓ సమీక్షలో సీఎం అన్నట్లు సమాచారం. వెంటనే ఫిట్​మెంట్​ అమలు చేస్తే ప్రభుత్వంపై ఒకేసారి ఆర్థిక  భారం పడుతుందని, దాని నుంచి బయటపడాలంటే ముందు ఐఆర్ ప్రకటించి, అటు తర్వాత కొంత సమయం తీసుకున్నాక పూర్తి  ఫిట్​మెంట్ ఇస్తే కొంచెం వెసులుబాటు దొరుకుతుందని ఆర్థికశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే.. ఫిట్​మెంట్​ ఎప్పుడు అమలు చేసినా ఏదో రకమైన అసంతృప్తి వ్యక్తమవుతుందని, అందుకని ఎప్పుడో ఒకప్పుడు దాన్ని ప్రకటిస్తే సరిపోతుందన్న అభిప్రాయానికి సీఎం వచ్చినట్లు ఓ అధికారి చెప్పారు.