పెట్టుబడుల పరంగా తెలంగాణ ర్యాంకు పడిపోయింది

పెట్టుబడుల పరంగా తెలంగాణ ర్యాంకు పడిపోయింది
  • ఆరో స్థానం నుంచి 9వ స్థానానికి.. ‘ప్రాజెక్ట్స్ టుడే’ రిపోర్టులో వెల్లడి
  • 2022–23లో దేశంలో పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులపై సర్వే
  • గతంలో టాప్ టెన్‌‌‌‌లోనే లేని ఏపీ.. ఇప్పుడు ఏకంగా ఫస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు

హైదరాబాద్, వెలుగు:పెట్టుబడుల పరంగా మన రాష్ట్రం దేశంలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నిరుటితో పోలిస్తే వచ్చిన కొత్త ప్రాజెక్టుల సంఖ్య తగ్గిపోయింది. ఆయా సంస్థల పెట్టుబడుల విలువ పెరిగినా.. రాష్ట్ర ర్యాంకు మాత్రం దిగజారింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను ‘ప్రాజెక్ట్స్ టుడే’ అనే సంస్థ దేశానికి వచ్చిన కొత్త పెట్టుబడులపై సర్వే నిర్వహించింది. తాజాగా రిలీజ్ చేసిన సర్వే రిపోర్టు ప్రకారం.. తెలంగాణకు 487 కొత్త ప్రాజెక్టులు రాగా.. రూ.1,58,482 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అయితే 2021–2022తో పోలిస్తే ప్రాజెక్టులు తగ్గాయి. ర్యాంకు పడిపోయింది. ఆ ఏడాది 536 కొత్త ప్రాజెక్టులు వచ్చాయి.

ఆ పెట్టుబడుల విలువ రూ.1,10,151 కోట్లు. 2021 - 2022లో పెట్టుబడుల్లో ఆరో స్థానంలో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోయింది. పెట్టుబడుల్లోనే కాదు.. కొత్త ప్రాజెక్టుల విషయంలోనూ తొమ్మిదో స్థానంతోనే సరిపెట్టుకుంది. మరోవైపు గతంలో ఎన్నడూ టాప్ టెన్‌‌లోనే లేని ఆంధ్రప్రదేశ్ మాత్రం టాప్ ప్లేస్‌‌లోకి దూసుకొచ్చింది. భారీ పెట్టుబడులను ఆకర్షించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగానూ ఏపీకి 306 కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. రూ.7,65,030 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. మన రాష్ట్రంతో పోలిస్తే ఏపీకి వచ్చిన కొత్త ప్రాజెక్టుల సంఖ్య తక్కువే అయినా.. వాటి విలువ మాత్రం భారీగా ఉండడం గమనార్హం. తెలంగాణతో పోలిస్తే దాదాపు 5 రెట్లు ఎక్కువ. టాప్ ప్లేస్​లో ఉన్న గుజరాత్‌‌ను కూడా ఏపీ వెనక్కి నెట్టేయడం గమనార్హం.

మస్తు సౌలతులున్నా..

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉందంటూ గతంలో ఎన్నో సార్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దావోస్‌‌లో సదస్సులకు వెళ్లినప్పుడల్లా పెట్టుబడుల గురించి భారీగా ప్రచారం చేశారు. కానీ ‘ప్రాజెక్ట్స్ టుడే’ రిపోర్ట్​ ప్రకారం మాత్రం మన రాష్ట్రం పలు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే కింది స్థానాల్లోనే ఉంది. గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌‌‌‌ప్రదేశ్‌‌.. తెలంగాణ కన్నా ముందు వరుసలో ఉన్నాయి. ఒడిశా, రాజస్థాన్, తమిళనాడుల్లోనూ మన కన్నా ఎక్కువ ప్రాజెక్టులు, పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టుల విషయంలో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆ రాష్ట్రానికి వచ్చిన కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గిపోయాయి. 1,326 ప్రాజెక్టులు.. రూ.4,47,435 కోట్లతో గత సంవత్సరం టాప్‌‌లో నిలిచిన గుజరాత్​.. ఈ సారి 1,008 ప్రాజెక్టులతో సరిపెట్టుకుంది. పెట్టుబడులు రూ.4.44 లక్షలకు పడిపోయాయి. 1,639 కొత్త ప్రాజెక్టులతో మహారాష్ట్ర టాప్‌‌లో ఉంది. పెట్టుబడుల్లో మాత్రం నాలుగో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే కొత్త ప్రాజెక్టుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.

ఏపీకి కలిసొచ్చిన గ్లోబల్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ సమిట్‌‌

ఏపీకి ఒకేసారి అంతమొత్తంలో పెట్టుబడులు రావడానికి కారణం.. ఇటీవల వైజాగ్‌‌లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్‌‌మెంట్ సమిట్ అని నిపుణులు చెప్తున్నారు. ఆ సదస్సుతోనే ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలను ఏపీ ఆకర్షించగలిగిందని అంటున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ టాప్​టెన్​లోనే కూడా లేని ఆ రాష్ట్రం ఇప్పుడు టాప్​ ప్లేస్​లోకి వచ్చిందని పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్స్ టుడే రిపోర్ట్ ప్రకారం.. ఏపీకి వచ్చిన కొత్త ప్రాజెక్టుల్లో 57 మెగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి పెట్టుబడుల విలువే రూ.7,28,667 కోట్లు కావడం గమనార్హం. అంటే ఆ రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో వాటి విలువే 95 శాతం. మెగా ప్రాజెక్టుల్లో 7 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, 18 హైడల్ పవర్​ ప్రాజెక్టులు ఉన్నాయి.

దేశంలో 92 శాతం పెరిగినయ్

దేశవ్యాప్తంగా పెట్టుబడులు గణనీయంగా పెరిగినట్టు ‘ప్రాజెక్ట్స్ టుడే’ సర్వే తేల్చింది. 2021-22తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు 91.97 శాతం పెరిగినట్టు తెలిపింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు 94.76 శాతం పెరిగినట్టు చెప్పింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.19.27 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. ఇప్పుడు ఆ మొత్తం రూ.36.99 లక్షలకు పెరిగినట్టు రిపోర్టులో వివరించింది. కొత్త ప్రాజెక్టుల సంఖ్య 10,445 నుంచి 10,509కి పెరిగింది. 6,705 ప్రభుత్వ ప్రాజెక్టులకు గానూ రూ.11.68 లక్షల కోట్లు, 3,804 ప్రైవేటు ప్రాజెక్టులతో రూ.25.31 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశవ్యాప్తంగా వచ్చిన ఇన్వెస్ట్​మెంట్లలో అత్యధికంగా తయారీ రంగంలోనే రావడం విశేషం. అంతకుముందుతో పోలిస్తే తయారీ రంగంలో పెట్టుబడుల విలువ 145 శాతం పెరిగాయి. రూ.19.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాని తర్వాత మౌలిక వసతుల రంగంలో రూ.11.76 లక్షల కోట్ల ఇన్వెస్ట్​మెంట్లు వచ్చాయి.