దేశంలో నాన్‌‌‌‌వెజ్‌‌‌‌ తినడంలో మనమే టాప్‌‌‌‌

దేశంలో నాన్‌‌‌‌వెజ్‌‌‌‌ తినడంలో మనమే టాప్‌‌‌‌
  • ముద్ద దిగాలంటే.. ముక్క ఉండాల్సిందే..
  • ఏడాదికి ఒక్కొక్కరు 9.2 కిలోల మాంసం తింటున్నరు
  • తెలంగాణలో 98.73 శాతం మాంసాహారులే
  • దేశవ్యాప్తంగా 61.86 శాతం మంది
  • మటన్‌‌‌‌ ధరలోనూ రాష్ట్రమే టాప్‌‌‌‌
  • 2025 నాటికి కిలో వెయ్యి దాటొచ్చని అంచనా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:

దసరా, బక్రీద్‌‌‌‌, బోనాలు, వనభోజనాలు.. పండుగ ఏదైనా ముక్క లేనిదే ముద్ద దిగుతలేదు. రాష్ట్రంలో ఏ చిన్న ఫంక్షన్‌‌‌‌ జరిగినా అక్కడ నాన్​వెజ్ మాత్రం తప్పనిసరి. దేశంలో మాంసం వినియోగంలో తెలంగాణ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌గా నిలిచింది.

60 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే..

దేశవ్యాప్తంగా మాంసాహారులు 61.86 శాతం మంది ఉంటే రాష్ట్రంలో ఏకంగా 98.73 శాతం మంది ఉన్నారు. దేశంలో తినే మాంసంలో 60 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే ఆహారంగా తీసుకుంటున్నారని జాతీయ మాంస పరిశోధన సంస్థ (ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌సీఎం) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి ఒక్కో వ్యక్తి ఏడాదికి 12 కిలోల మాంసాన్ని తినాలని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌) సూచిస్తోంది. అయితే జాతీయ స్థాయిలో తలసరి వినియోగం 2 కిలోల 900 గ్రాముల నుంచి 3 కిలోల 260 గ్రాములు వరకు ఉంటోంది. తెలంగాణలో మాత్రం 9 కిలోల 200 గ్రాముల మాంసాన్ని తింటున్నారని ప్రభుత్వ సంస్థల సర్వేలో తేలింది. మాంసం తినడంలో తెలంగాణ టాప్‌‌‌‌లో ఉండగా, తర్వాతి స్థానంలో ఏపీ ఉంది.

మటన్‌‌‌‌కు భారీ డిమాండ్

రాష్ట్రంలో 2012లో గొర్రెలు కోటి 28 లక్షల వరకు ఉండగా… ప్రస్తుతం1.91 కోట్లకు పెరిగినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ చేపట్టిన పశుగణనలో వెల్లడైంది. అయినా రోజుకు 6 వేల గొర్రెలు దిగుమతి అవుతూనే ఉన్నాయి. గొర్రెల మాంసానికి గిరాకీ ఎక్కువగా ఉండటంతో ఏటా మటన్‌‌‌‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ దసరాకు మటన్‌‌‌‌ ధర బొక్కలతో రూ.600 నుంచి రూ.620 ధర పలికింది. బొక్కలు లేకుండా రూ.740 వరకు అమ్మారు. మరోవైపు గత మూడు దశాబ్దాల్లో చికెన్‌‌‌‌ ధరల్లో పలుమార్లు మార్పులు వచ్చినా ఏనాడూ మటన్‌‌‌‌ ధర మాత్రం తగ్గక పోవడం గమనార్హం. 1980లో రూ.18 నుంచి రూ.20 వరకు పలికిన కిలో మటన్‌‌‌‌ ఇప్పుడు రూ.600 దాటింది. ఇలా మన రాష్ట్రంలోనే మటన్ రేటు ఎక్కువగా ఉంది. రాజస్తాన్‌‌‌‌లో మేక మాంసం రూ.350 మాత్రమే. 2025 నాటికి కిలో మటన్‌‌‌‌ రూ.1,000 దాటుతుందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గొర్రె మాంసమే ఎక్కువగా తింటున్నట్లు పశుసంవర్ధకశాఖ అధ్యయనంలో తేలింది. నార్త్‌‌‌‌ ఇండియాలో బక్రీద్‌‌‌‌ రోజున మేకపోతులను బలిస్తుండగా, రాష్ట్రంలో గొర్రెపోతులను బలిస్తున్నారు. ఇక్కడి నేపథ్యం, రుచిగా ఉంటుందని బిర్యానీలో గొర్రె మాంసమే ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ఆ రెండు రోజుల్లో హైదరాబాద్‌‌‌‌లో 400 టన్నులు

హైదరాబాద్‌‌‌‌లో దసరా, బక్రీద్‌‌‌‌ పండుగలకు 30 వేల చొప్పున యాటలు తెగుతయి. యావరేజ్‌‌‌‌గా ఈ రెండు రోజుల్లోనే 400 టన్నుల మాంసం అమ్మకాలు జరుగుతాయని ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌సీఎం గణాంకాలు చెబుతున్నాయి. 2014–15లో 5.05 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తితో 12 కిలోల తలసరి లభ్యత నమోదు కాగా, 2018–19 నాటికి 7.54 లక్షల టన్నులు మాంసంతో తలసరి లభ్యత 16 కిలోల వరకు పెరిగినట్లు పశుసంవర్ధకశాఖ చెబుతోంది.

ప్రపంచంలో ఇండియా 42వ స్థానం

ప్రపంచ వ్యాప్తంగా మాంసం వినియోగంలో  ఇండియా వెనకబడింది. 2.9 కిలోల తసరి వినియోగంతో 42వ స్థానంలో ఉంది.  95.43 కిలోల తలసరి వినియోగంతో అమెరికా మొదటి స్థానంలో నిలవగా.. బ్రెజిల్‌‌‌‌, రష్యా, చైనా, సౌతాఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.