‘ఉపాధి హామీ’లో రాష్ట్రానికి ఐదు అవార్డులు

‘ఉపాధి హామీ’లో రాష్ట్రానికి ఐదు అవార్డులు

న్యూఢిల్లీ, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నందుకు రాష్ట్రానికి ఐదు అవార్డులు వచ్చాయి. గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ అవార్డులను వివిధ రాష్ట్రాలకు అందించారు. 2018–19కి ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రానికి రెండు రాష్ట్రస్థాయి, రెండు జిల్లాస్థాయి, ఒక గ్రామస్థాయి అవార్డులు లభించాయి. మిషన్​ వాటర్​ కన్జర్వేషన్​ అమలులో రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. శ్యాంప్రసాద్​ ముఖర్జీ రూర్బన్​ మిషన్​లో భాగంగా జియోస్పేషియల్​ ప్లానింగ్​ను దేశంలోనే వేగంగా పూర్తి చేసినందుకు మరో అవార్డు వచ్చింది. ఆ రెండు అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్​ రఘునందన్​రావు అందుకున్నారు. లక్ష్యాలను చేరుకున్న జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల నాలుగో స్థానంలో నిలవగా, సిద్దిపేట ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఈ అవార్డులను ఆయా జిల్లాల కలెక్టర్లు కృష్ణ భాస్కర్​, పి. వెంకటరామి రెడ్డిలు తీసుకున్నారు. ఉపాధి హామీ ద్వారా అభివృద్ధి చెందిన గ్రామాల జాబితాలో వికారాబాద్​ జిల్లాలోని నవాబ్​పేట మండలం లింగంపల్లికి అవార్డు వచ్చింది. ఆ ఊరి సర్పంచ్​ ఎస్​. నర్సింహులు అవార్డును అందుకున్నారు.

telangana state receives five awards for upadi hami pathakam