మోత్కూరు, వెలుగు : ‘పది రోజుల్లో రోడ్డు పనులను మొత్తం పూర్తి చేయాలి.. లేదంటే నువ్వూ ఉండవు, నీ కంపెనీ ఉండదు’ అంటూ తెలంగాణ స్టేట్ రోడ్స్ సీఈ మోహన్‌నాయక్ కాంట్రాక్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. మోత్కూరు పట్టణంలోని మిల్క్ చిల్లింగ్ సెంటర్ నుంచి భువనగిరి వైపు రాజన్నగూడెం వరకు రూ. 5 కోట్లతో త్రీ లేన్ బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు పనులు చేస్తున్న సీ5 కాంట్రాక్టర్ పనులను అసంపూర్తిగా వదిలేసి, ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అలాగే గుంతలు, దుమ్ముతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయాన్ని స్థానిక లీడర్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాలతో స్టేట్ రోడ్స్ సీఈ మోహన్ నాయక్ శుక్రవారం పనులను పరిశీలించారు. స్టేట్ ఆఫీసర్లు వస్తున్నారని తెలియడంతో కాంటాక్టర్ కంకర పోసి పనులు స్టార్ట్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని స్థానికులు సీఈ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పనులు జరుగుతున్న తీరు, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో కాంట్రాక్టర్, సూపర్‌వైజర్లను మందలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3.4 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. రోడ్డు లెవల్‌ను సరిచేసి, పనులు క్వాలిటీగా చేయాలని ఆదేశించారు. పది రోజుల్లో పనులు పూర్తి చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్‌ఈ నర్సింహనాయక్, ఈఈ శంకరయ్య, డీఈ షహనాజ్ ఉన్నారు.