
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని, ఆయన ధృడ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదని అన్నారు సీఎం కేసీఆర్. ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిదన్నారు. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోయే వ్యక్తి జయశంకర్ అని పేర్కొన్నారు. ఉద్యమకారుడి నుంచి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారని అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.