భవిష్యత్తు మానవ వనరుల నిర్మాణంలో విద్య కీలకమైనది. విద్య రాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా విద్యపై ప్రభుత్వం విధాన నిర్ణయాలు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ, సంస్థాగతంగా తీవ్ర అంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నది. విద్యార్థులు లేని పాఠశాలలుగా మిగిలిపోతున్నవి. నేడు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివించే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు మెరుగైన విద్యను కోరుకుంటున్నారు.
కానీ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేమి, ఉపాధ్యాయుల కొరత, కొరవడుతున్న ప్రభుత్వ నిబద్ధత వలన ప్రభుత్వ విద్యాసంస్థల తీరు అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో విద్యావ్యవస్థను గాడిలోపెట్టే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా కమిషన్ను నియ మించింది. ఇటీవల విద్యా కమిషన్ సమర్పించిన విద్యా విధానపత్రం 2026 విడుదల చేసింది. ఆధునిక విద్యావ్యవస్థకు అవసరమైన సిఫారసులు చేసింది. ఈ విధానపత్రం విద్యావ్యవస్థ మెరుగుపరచడానికి 18 శాతం నిధులు కావాలని స్పష్టం చేసింది.
కానీ, ప్రభుత్వం గత ఏడాదితో(7.6 శాతం) పోలిస్తే స్వల్పంగానే 8.2 శాతమే నిధులు కేటాయించింది. దేశ సగటు (14–15%)తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ నిధులతో విద్యా కమిషన్ సిఫార్సులు ఏ మేరకు అమలవుతాయనేది ప్రశ్నార్థకమే. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్యం స్వాగతించాల్సిన అంశం. కానీ, రిటైరైన ఉద్యోగుల బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు, పిఆర్సీ ప్రస్తావన లేకపోవడం విచారకరం. ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం నాణ్యతకు అదనపు నిధులు కేటాయించకపోవడం శోచనీయం. ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే కార్పొరేట్ విద్యా వ్యవస్థ పుంజుకుంటుంది. ఇది బడుగు, బలహీన వర్గాల పాలిట శాపంగా మారుతుంది. విద్యను ప్రాధాన్యత కొరవడిన రంగంగా చూడడం సరికాదు.
సంపతి రమేష్, సోషల్ ఎనలిస్ట్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
* రచన 700 పదాలకు మించరాదు.
