సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ స్టూడెంట్లు

సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ స్టూడెంట్లు
  • టెన్త్​లో 99.83%..12వ తరగతిలో 99.73% పాస్

హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) టెన్త్, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల కోసం 533  సీబీఎస్ఈ స్కూళ్ల నుంచి 51,604 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకూ జరిగిన టెన్త్ పరీక్షల్లో  51,521 మంది హాజరు కాగా, వారిలో 51,433 (99.83%) మంది పాసయ్యారు. పాసైన వారిలో 28,504 మంది బాయ్స్, 22,929 మంది బాలికలున్నారు.

12వ తరగతి పరీక్షల కోసం 146  స్కూళ్ల నుంచి  8,477 మంది ఎగ్జామ్ రాసేందుకు ఫీజు చెల్లించారు. స్టేట్​లో ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి. కాగా.. పరీక్షలకు 8,443 మంది ఎగ్జామ్కు అటెండ్ కాగా, 8420 (99.73%) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాయ్స్ 4,425 మంది, బాలికలు 3,995 మంది ఉన్నారు. ఫలితాలను https://www.cbse.gov.in వెబ్ సైట్లో చూడాలని అధికారులు సూచించారు.

కాగా, దేశవ్యాప్తంగా టెన్త్ లో 23,85,079 మంది రిజిస్ర్టేషన్ చేసుకోగా.. 23,71,939 మంది పరీక్షలకు అటెండ్ అయ్యారు. వారిలో 22,21,636 (93.66%) మంది పాసయ్యారు. గతేడాదితో పోలిస్తే 0.06శాతం ఉత్తీర్ణత పెరిగింది. 12వ తరగతిలో 17,04,367 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. వారిలో 16,92,794 మంది పరీక్షలకు అటెండ్ కాగా..  14,96,307 (88.39%) మంది పాసయ్యారు. పదో తరగతి, 12వ తరగతిలో జాతీయ ఉత్తీర్ణత సగటు కంటే తెలంగాణ సగటే ఎక్కువగా ఉండటం గమనార్హం.