
హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్స్ ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు మారేందుకు అవసరమైన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ల (టీసీ)కు సంబంధించి విద్యా శాఖ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ విద్యాసంవత్సరం నుంచి మ్యాన్యువల్ టీసీలకు స్వస్తి చెప్పి, డిజిటల్ టీసీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లను మ్యాన్యువల్గానే విద్యార్థులకు అందిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్ మేనేజ్మెంట్లు స్టూడెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు అధికారుల దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
లక్షల మందికి ప్రయోజనం..
స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 58.50 లక్షల స్టూడెంట్లు చదువుతున్నారు. ఏటా చాలా మంది స్టూడెంట్లు ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు మారుతున్నారు. అలా మారినవారు అప్పటివరకు చదివిన స్కూల్ నుంచి టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సిందే. ఈ సమయంలో స్కూల్ మారొద్దని, ఫీజులు కట్టాలని అంటూ స్కూళ్లు స్టూడెంట్లను ఇబ్బంది పెడుతున్నాయి.
ఈ ఏడాది నుంచే డిజిటల్ టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్ల జారీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులకు ఆ కష్టాలు తప్పనున్నాయి.
అడ్మిషన్ నంబర్ ఆధారంగా..
ప్రతి స్టూడెంట్‌కు అడ్మిషన్ నంబర్ ఆధారంగా డిజిటల్ టీసీలను ఇవ్వనున్నారు. ఏ స్కూల్ నుంచైనా మరో స్కూల్‌కు మారినప్పుడు ఆన్‌లైన్‌లో టీసీ, బోనఫైడ్ చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నింటికీ ఇది వర్తిస్తుంది. టెన్త్ పూర్తయి కాలేజీల్లో చేరేందుకు మాత్రం మ్యాన్యువల్ టీసీలే ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ గురుకులాల్లో చేరే విద్యార్థులకు టీసీలు, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లోనే పంపించనున్నారు. మిగతా సంక్షేమ శాఖల పరిధిలోని కాలేజీలతోనూ ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో విద్యాశాఖ అధికారులున్నారు.