- ఒకటో తరగతి నుంచే సంగీతం, డ్రాయింగ్
- వియత్నాం విద్యా విధానాన్ని పరిశీలించిన తెలంగాణ విద్యాశాఖ బృందం
హైదరాబాద్, వెలుగు: బట్టీ చదువులకు స్వస్తి పలికి విద్యార్థుల్లో సమగ్ర వికాసాన్ని సాధించే దిశగా వియత్నాం అనుసరిస్తున్న విద్యా విధానంపై తెలంగాణ విద్యాశాఖ దృష్టి పెట్టింది. అక్కడి స్కూళ్ల పనితీరు, పాఠ్యాంశాల తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ జేడీ వెంకటనర్సమ్మ నేతృత్వంలోని ఉపాధ్యాయ బృందం వియత్నాంలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా వియత్నాం ఎడ్యుకేషన్ స్ట్రాటజీ అండ్ పాలసీ ఇన్స్టిట్యూట్తో భేటీ అయిన బృందం, అక్కడి విప్లవాత్మక విద్యా విధానాలను పరిశీలించింది.
బట్టీ చదువులకు స్వస్తి
తరగతి గదిలో టీచర్ పాఠం చెప్పడం, విద్యార్థులు పుస్తకాలు బట్టీ పట్టే పాత లెక్చర్ పద్ధతులకు వియత్నాం గుడ్‌బై చెప్పింది. విద్యార్థులు చురుగ్గా పాల్గొనే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, గ్రూప్ డిస్కషన్లు, కొలాబరేటివ్ లెర్నింగ్, అసైన్మెంట్ల ద్వారా స్వయంగా ఆలోచించి నేర్చుకునే పద్ధతులను అమలు చేస్తున్నారు. ఇది పిల్లల్లో సమస్యలను పరిష్కరించే క్రిటికల్ థింకింగ్ పెంచుతోంది. బడుల్లో టెక్నాలజీ వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
టీచర్లందరికీ ప్రభుత్వమే ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ ఉపకరణాలు సమకూర్చింది. క్లాస్‌రూమ్‌లలో ఏఐ, డిజిటల్ కంటెంట్‌ను ఉపయోగించి బోధిస్తున్నారు. వియత్నాంలో ప్రైమరీ స్థాయిలో ఏకంగా 99 శాతం సర్కారు బడులే ఉన్నాయి. ప్రైవేటు బడుల వాటా ప్రాథమిక స్థాయిలో ఒక్క శాతం మాత్రమే కాగా, హయ్యర్ సెకండరీలో 6 శాతంగా ఉంది. మారుమూల గ్రామాలు, అన్ని వర్గాల పిల్లలకు ప్రభుత్వమే సమానంగా ఆధునిక మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో ప్రజలంతా సర్కారు బడులవైపే నమ్మకంగా చూస్తున్నారు.
3వ తరగతి నుంచే ఇంగ్లిష్
వియత్నాంలో స్కూల్ ఎడ్యుకేషన్ మూడు దశల్లో సాగుతోంది. ఆరేళ్ల వయసులో ప్రారంభమయ్యే ప్రైమరీ (1–-5 తరగతులు), లోయర్ సెకండరీ (6-–9 తరగతులు), అప్పర్ సెకండరీ (10–-12 తరగతులు). దీనిలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. డ్రాపౌట్లు లేకుండా పునాది, మాధ్యమిక విద్య పకడ్బందీగా అమలవుతోంది. బోధన ప్రధానంగా అధికారిక భాష అయిన వియత్నామీస్‌లో సాగుతుండగా, మారుమూల తెగల పిల్లలకు మాతృభాషల్లోనూ వెసులుబాటు కల్పించారు.
అంతర్జాతీయ ప్రమాణాల కోసం మూడో తరగతి నుంచే ఇంగ్లిషును విదేశీ భాషగా ప్రవేశపెట్టి ప్రావీణ్యం పెంచుతున్నారు. కాగా, ఒకటో తరగతి నుంచే స్విమ్మింగ్, ఆర్ట్, క్రీడల అనుసంధానం, డిజిటల్ లెర్నింగ్, ప్రాక్టికల్ విద్యా విధానాలను తెలంగాణ విద్యా వ్యవస్థలో అమలు చేసేందుకు గల అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
బడుల్లోనే స్విమ్మింగ్ పూల్స్
వియత్నాం బడుల్లో ప్రతి పిల్లాడు స్విమ్మింగ్ నేర్చుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. స్కూల్ప్రాంగణాల్లోనే స్విమ్మింగ్ పూల్స్ సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, సంపూర్ణ ఫిట్నెస్ పెరగడమే కాకుండా, ప్రమాదవశాత్తూ నీటిలో పడితే ప్రాణాలు కాపాడుకునేలా ‘వాటర్ సేఫ్టీ’పై చిన్నతనం నుంచే పట్టు సాధిస్తున్నారు.
ఫస్ట్ క్లాస్ నుంచే ఫిజికల్ ఎడ్యుకేషన్, సంగీతం, డ్రాయింగ్ ను రెగ్యులర్ సిలబస్‌లో తప్పనిసరి భాగంగా చేర్చారు. దీంతో పాటు విద్యార్థుల్లో స్నేహభావం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత ప్రవర్తన, సృజనాత్మకత అనే ‘పంచ సూత్రాల’ నైతిక విలువలను తరగతి గది నుంచే అలవర్చుతున్నారు.
