- ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
- దేశానికే తెలంగాణ ఆదర్శం: మంత్రి సీతక్క
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ 10 జల పురస్కారాలను దక్కించుకుంది. 2024కు సంబంధించి జాతీయ జల పురస్కారా(6వ )ల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది. అన్ని రాష్ట్రాల పనితీరు ఆధారంగా ‘జల్ సింఛాయ్ –జన్ భాగీదారి’(జేఎస్ జేబీ1.0) అవార్డులను కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో మొత్తం 5,20,362 పనులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది.
మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ కమిషనర్ డా. శ్రీజన అవార్డును అందుకున్నారు. అలాగే.. టాప్ 10 మున్సిపాలిటీల్లో రెండో ర్యాంక్ దక్కించుకొన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ అవార్డును ఎండీ కే.అశోక్ కుమార్ రెడ్డి స్వీకరించారు.
కేటగిరీ-1లో ఆదిలాబాద్ టాప్
సౌత్ జోన్(తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి)లో మూడు కేటగిరీల్లో కలిపి మొత్తం 8 అవార్డులు మన రాష్ట్రానికి దక్కాయి. కేటగిరీ 1లో 98,693 పనులతో ఆదిలాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. 84,827 పనులతో నల్గొండ, 84,549 పనులతో మంచిర్యాల వరుసగా ద్వితియ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. కేటగిరీ 2లో వరంగల్, నిర్మల్, జనగాం వరుసగా మూడు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. కేటగిరీ 3లో భద్రాద్రి కొత్తగూడెం ఫస్ట్ ప్లేస్ లో , 3వ స్థానంలో మహబూబ్ నగర్ లకు అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను ఆయా జిల్లాల కలెక్టర్లు అందుకున్నారు.
టాప్-10 మున్సిపాలిటీల్లో 2వ ర్యాంక్ దక్కించుకున్న హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు అవార్డు కింద రూ. 2 కోట్లు అందనున్నాయి. కేటగిరీ-1,2 జిల్లాలకు రూ.1 కోటి, కేటగిరీ-3 జిల్లాలకు రూ. 25 లక్షలు అందనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను మంత్రి సీతక్క అభినందించారు. అధికారుల కృషి, సమన్వయం, నిబద్ధతను ఓ ప్రకటనలో ప్రశంసించారు.
