మక్తల్, వెలుగు : ఖేలో ఇండియాలో తెలంగాణకు ఖోఖో విభాగంలో స్వర్ణ పతకమే లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఖేలో ఇండియా పోటీలకు రాష్ట్రస్థాయి క్రీడాకారులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం మక్తల్ గ్రౌండ్లో ఖేలో ఇండియా ఎంపికల్లో భాగంగా ఖోఖో క్రీడాకారులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని మంత్రి సందర్శించారు.
క్రీడాకారులకు కల్పించిన వసతులు, శిక్షణ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా క్రీడాశాఖ ఆఫీసర్ వెంకటేశ్‌తో మాట్లాడి శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మక్తల్‌లో ఖోఖోకు సంబంధించి మూడు ఎంపిక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే ఖేలో ఇండియా క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఖోఖోలో స్వర్ణ పతకం సాధించాలని ఆకాంక్షించారు.
అభివృద్ధి పనుల పరిశీలన..
మక్తల్ పట్టణంలోని 3వ వార్డు కేశవ నగర్ నుంచి దండు వరకు రూ2.50 కోట్లతో చేపడుతున్న రహదారి, వంతెన నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. మక్తల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస, కౌన్సిలర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.
