- అక్రెడిటేషన్, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదు
- త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం పెడ్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, జీవో 252ను సవరించి.. వారికి నష్టం జరగకుండా మార్పులు చేసి ఇస్తామని ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహించి, తుది జీవోను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అక్రెడిటేషన్ కార్డులకు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని స్పష్టం చేశారు.
ప్రభు త్వ పరంగా అక్రెడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియాకార్డు దారులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. మంగళవారం సచివాలయంలో టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎఫ్టీ ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రికి వివిధ అంశాలను వివరించా రు. స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి.. జీవోపై కొంత మంది అపోహలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని స్పష్టం చేశారు. డెస్క్ జర్నలిస్టులు ఆందోళన చెందొద్దని, తాను అండగా ఉంటానని చెప్పారు.
ఇది జర్నలిస్టులను రెండు భాగాలుగా చూడాలన్న ఆలోచన కాదని, ప్రభుత్వ పరంగా అందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెం టనే అన్ని జర్నలిస్టుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి డెస్కు జర్నలిస్టులనూ ఆహ్వానిస్తామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకొని జర్నలిస్టులకు మరింత ప్రయోజనం చేకూరేలా జీవో 252లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు.
మంత్రిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి గండ్ర నవీన్, డీజేఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాదిని ఉపేందర్, కార్యదర్శి మస్తాన్, ఉపాధ్యక్షుడు రాజారామ్, ట్రెజరర్ నిస్సార్, జాయింట్ సెక్రటరీ విజయ, స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, శ్రీనివాస్, జర్నలిస్టుల ప్రతి నిధులు సురేశ్, వెంకటరమణ, శేఖర్, రమేశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు పునరుద్ధరిస్తం
స్పోర్ట్స్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. జీవో 252లో స్పోర్ట్స్, సినిమా, ఫీచర్స్, కల్చరర్ జర్నలిస్టులకు ప్రత్యే క కోటా లేకపోవడాన్ని స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ఎస్జే ఏటీ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ దాస్ మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
జీవో 252లో సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని టీయూడబ్ల్యూజే కోరింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధులు మంత్రికి వినతిపత్రాన్ని అందించారు.
