ఆయుధాలను ఎగుమతి చేద్దాం..దేశ రక్షణ రంగానికి తెలంగాణను గ్లోబల్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా మారుస్తం: సీఎం రేవంత్

ఆయుధాలను ఎగుమతి చేద్దాం..దేశ రక్షణ రంగానికి తెలంగాణను గ్లోబల్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా మారుస్తం: సీఎం రేవంత్
  • త్వరలోనే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0 రిలీజ్ చేస్తం
  • డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్
  • రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 32,850 కోట్లకు పెరిగినయ్: ఉత్తమ్
  • కోతల్లేకుండా కరెంట్​ ఇస్తం.. యువతకు ఉద్యోగాలివ్వండి: భట్టి

హైదరాబాద్, వెలుగు:  దేశ రక్షణ రంగానికి తెలంగాణను అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విదేశాల నుంచి యుద్ధ సాంకేతికతను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి రక్షణ ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగాలనిపిలుపునిచ్చారు. హైదరాబాద్ తాజ్ ఫలక్‌‌నుమా ప్యాలెస్‌‌లో శనివారం నిర్వహించిన ‘రక్షా ఎక్స్‌‌పో–2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌‌’కు ప్రపంచ రక్షణ, ఏరోస్పేస్ దిగ్గజాలను ఆహ్వానించారు. 

యుద్ధం కోసమే కాకుండా శాంతిని కాపాడేందుకు, శత్రువుల దాడులను అడ్డుకునే వ్యూహాత్మక ఆధిక్యం కోసం రక్షణ పరిశ్రమలను బలోపేతం చేయాలన్నారు. తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో రక్షణ, ఏరోస్పేస్ రంగాలు కీలకమని చెప్పారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జాతీయ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉందని, దీన్ని 10 శాతానికి పెంచడమే లక్ష్యమని వెల్లడించారు.

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ వేదిక

ఫ్యూచర్ సిటీలో రెండో గ్లోబల్ సమ్మిట్‌‌ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ అత్యంత సురక్షిత నగరమని, ఇక్కడ భారత సైన్యం, వైమానిక దళాల వ్యూహాత్మక కేంద్రాలతో పాటు కీలక పరిశోధనా సంస్థలు ఉన్నాయని తెలిపారు. డీఆర్‌‌డీఓ, హెచ్‌‌ఏఎల్, బీడీఎల్, మిధాని వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు టాటా, ఎయిర్‌‌బస్, సాఫ్రాన్, స్కైరూట్, లాక్‌‌హీడ్ మార్టిన్, భారత్ ఫోర్జ్ వంటి అంతర్జాతీయ ప్రైవేట్ దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణను ఏరోస్పేస్, అంతరిక్షం, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డ్రోన్ టెక్నాలజీ హబ్‌‌గా నిలపడమే లక్ష్యమన్నారు. యువతను అంతర్జాతీయ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఎన్‌‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఎస్‌‌బీ వంటి విద్యాసంస్థలతో పాటు స్టార్టప్‌‌ల కోసం ఇంక్యుబేటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రక్షణ దళాల ఉన్నతాధికారులు, అంతర్జాతీయ నిపుణులు, గ్లోబల్ ఓఈఎంలు, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు ఆవిష్కరణలను పంచుకునేలా ‘రక్షా ఎక్స్‌‌పో’ను అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.

గ్రీన్ ఎనర్జీని పెంచుతున్నం: భట్టి

పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడమే అభివృద్ధి కాదని, నిరంతర నాణ్యమైన విద్యుత్, స్థానిక యువతకు స్థిరమైన ఉపాధి కల్పించడమే తమ ప్రాధాన్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏరోస్పేస్ రంగంలో మైక్రాన్ స్థాయి కొలతలు ఎంత కచ్చితంగా ఉంటాయో.. ప్రభుత్వ అనుమతులు, చెల్లింపులు, విధానాలు కూడా అంతే కచ్చితత్వంతో పనిచేయాలన్నారు. తయారీకి ఆటంకం లేకుండా విద్యుత్ అందించేందుకు గ్రిడ్‌‌ను బలోపేతం చేస్తున్నామని, గ్రీన్ ఎనర్జీ, విద్యుత్ నిల్వ వ్యవస్థలను పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తే నైపుణ్యం కలిగిన ఏరోస్పేస్ టెక్నీషియన్లుగా ఎదుగుతారని చెప్పారు. వారికి అప్రెంటిస్‌‌షిప్, తొలి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలదేనన్నారు.

రక్షణ రంగంలో తెలంగాణకు గుర్తింపు: ఉత్తమ్

తెలంగాణ నుంచి రక్షణ, ఏరోస్పేస్ ఉత్పత్తుల ఎగుమతులు రూ.15,900 కోట్ల నుంచి రూ.32,850 కోట్లకు పెరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదిబట్లలో టాటా–బోయింగ్ భాగస్వామ్యంతో అపాచీ హెలికాప్టర్ల బాడీ విడిభాగాలు తయారవుతున్నాయని చెప్పారు. టాటా–లాక్‌‌హీడ్ మార్టిన్ ప్రాజెక్టులు ప్రపంచ రక్షణ రంగంలో తెలంగాణకు గుర్తింపు తెస్తున్నాయని పేర్కొన్నారు. విమాన ఇంజిన్ల తయారీ, రాఫెల్ యుద్ధవిమానాల ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతు సేవల (ఎంఆర్వో) కోసం సాఫ్రాన్ హైదరాబాద్‌‌లో పెట్టుబడులను విస్తరిస్తోందని వివరించారు.

కొత్త పాలసీతో పరిశ్రమలకు ఊతం

రాష్ట్రంలో ‘పాలసీ పెరాలసిస్’ లేదని, రాజకీయ సిద్ధాంతాలు వేరైనా పెట్టుబడులు, అభివృద్ధి విషయంలో రాజీపడబోమని సీఎం తెలిపారు. రక్షణ, అంతరిక్షం, ఏఐ రంగాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలు తమ ప్రణాళికలను రెట్టింపు చేయాలని కోరారు. ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణకు సముద్రతీరం లేకున్నా వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో భారత నౌకాదళం కోసం అత్యంత తక్కువ పౌనఃపున్యాల (వీఎల్‌‌ఎఫ్) రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ కీలక సేవలు అందిస్తున్నామని గుర్తుచేశారు. 

రక్షణ పరిశ్రమలకు నిపుణులను అందించేందుకు ఐఐటీ, బిట్స్ వంటి సంస్థలతో పాటు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఐటీఐలను అధునాతన శిక్షణ కేంద్రాలుగా మారుస్తున్నామని చెప్పారు. ఒరిజినల్ ఎక్విప్‌‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ , సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అనుసంధానించేలా ‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యాలకు అనుగుణంగా త్వరలో ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0’ విడుదల చేస్తామని ప్రకటించారు.