- ఏజెన్సీలో ఎస్టీలకు 100% కోటాకు కోర్టు నో చెప్పడంతో సర్కార్ నిర్ణయం
- సుప్రీంకోర్టులో స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయండి
- పది రోజుల్లో లైన్ క్లియర్ చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
- స్పీడప్ కానున్న 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల భర్తీ ప్రక్రియ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏండ్లుగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 14 వేల పోస్టుల నియామకాలకు అడ్డుగా ఉన్న సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేసేందుకు లీగల్ గా చర్యలు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించింది. పది రోజుల్లోగా రిక్రూట్మెంట్ కు లైన్ క్లియర్ చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డెడ్ లైన్ పెట్టారు.
మంగళవారం సెక్రటేరియట్ లో న్యాయశాఖ సెక్రటరీ పాపిరెడ్డి, పీఆర్సీ చైర్మన్ ఎన్. శివశంకర్‌తో మంత్రి సమావేశం నిర్వహించారు. ఇందులో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా పాల్గొన్నారు.
అంగన్వాడీ పోస్టుల భర్తీలో న్యాయపరమైన చిక్కులను ఎలా అధిగమించాలనే దానిపై ఈ సమావేశంలో దృష్టి సారించారు. కోర్టు స్టేను ఎత్తివేయించడంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే కర్నాటక, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అంగన్వాడీ రిక్రూట్ మెంట్ విధానాన్ని అధ్యయనం చేసిన అధికారులు.. మంత్రికి రిపోర్టు ఇచ్చారు. ఆ రాష్ట్రాల్లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్ గా చూడటం లేదని, అందుకే అక్కడ 50 శాతం రిజర్వేషన్ల రూల్ వర్తించడం లేదని వివరించారు.
సుప్రీంలో స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్
కర్నాటక, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ అంగన్వాడీ రిక్రూట్మెంట్ ను అమలు చేసి, సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయించాలని అధికారులను మంత్రి సీతక్కఆదేశించారు. వెంటనే సుప్రీంకోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. ‘‘పది రోజుల్లోగా న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించి, నియామక ప్రక్రియ ప్రారంభించాలి. అంగన్వాడీ సేవలను బలోపేతం చేయడానికి ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి’’ అని మంత్రి తెలిపారు.
ఏజెన్సీలో రిజర్వేషన్లకు లైన్ క్లియర్
గత ప్రభుత్వం అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్, హెల్పర్ పోస్టులన్నీ స్థానిక ఎస్టీలకే కేటాయించింది. గిరిజన చిన్నారులకు వారి మాతృభాషలోనే పాఠాలు చెప్పడం సులువవుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటడంతో కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు ఈ నియామకాలపై స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు స్టేను ఎత్తివేయించడంపై అధికారులతో మంత్రి సీతక్క సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
