
- ఢిల్లీలో ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రితో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
హైదరాబాద్, వెలుగు: ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్‌కు 2 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేయనున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048) బియ్యంపై ఫిలిప్పీన్స్ తీవ్ర ఆసక్తి చూపుతోందని, ఈ నేపథ్యంలో ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో లారెల్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డీఎస్ చౌహన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ బియ్యానికి ఫిలిప్పీన్స్‌లో మంచి డిమాండ్ ఉందని, ఆ దేశానికి సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల బియ్యం అవసరమని ఈ భేటీలో ఫిలిప్పీన్స్ మంత్రి పేర్కొన్నారని ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి బియ్యంతో పాటు ధాన్యం, మొక్కజొన్నలను కూడా ఎగుమతి చేసేందుకు చర్చలు జరిగాయని, ఈ భేటీ ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయని మంత్రి వివరించారు.
తెలంగాణ సోనా బియ్యం ఎగుమతి ప్రతిపాదనకు ఫిలిప్పీన్స్ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశం తెలంగాణ, -ఫిలిప్పీన్స్ మధ్య సన్నిహిత సంబంధాలకు ఇది దారితీస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే, తెలంగాణను సందర్శించాలన్న తమ ఆహ్వానంపై ఫిలిప్పీన్స్ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే, తెలంగాణ బియ్యం, ధాన్యాల ఎగుమతుల పరిధిని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇది రాష్ట్ర రైతులకు, వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.