కృష్ణా నీళ్ల పంపిణీ కోసం మరోసారి సుప్రీం కోర్టుకు తెలంగాణ

కృష్ణా నీళ్ల పంపిణీ కోసం మరోసారి సుప్రీం కోర్టుకు తెలంగాణ

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా నీళ్ల పంపిణీ కోసం మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శుక్రవారం కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేయనుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కృష్ణాలో నాణ్యమైన వాటా దక్కేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేసింది. ఇంటర్‌‌ స్టేట్‌‌ వాటర్‌‌ డిస్ప్యూట్స్‌‌ యాక్ట్‌‌ -1954లోని సెక్షన్‌‌ -3 కింద ట్రిబ్యునల్‌‌కు రెఫర్‌‌ చేయాలని కోరుతూ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి, సీడబ్ల్యూసీకి లేఖలు రాసింది.

2020 అక్టోబర్‌‌ 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌ అధ్యక్షతన నిర్వహించిన అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ రెండో సమావేశంలో కృష్ణాలో నీటి వాటాలు తేల్చాలని కేసీఆర్‌‌ పట్టుబట్టారు. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌‌ను విత్‌‌డ్రా చేసుకుంటే న్యాయసలహా తీసుకొని కొత్త ట్రిబ్యునల్‌‌ ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని షెకావత్‌‌ హామీ ఇచ్చారు. పిటిషన్‌‌ విత్‌‌డ్రా చేసుకొని ఏడాది దాటినా ట్రిబ్యునల్‌‌ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్లీ కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాలని కేసీఆర్‌‌ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేయనున్నారు.