61వేల ఎకరాల్లో సహజ సాగు .. కేంద్రం తెచ్చిన నేచురల్ ఫామింగ్ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్రం గ్రీన్ సిగ్నల్

61వేల ఎకరాల్లో సహజ సాగు .. కేంద్రం తెచ్చిన నేచురల్ ఫామింగ్ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్రం గ్రీన్ సిగ్నల్
  • ఈ వానాకాలం సీజన్ నుంచి అమలు
  • క్లస్టర్‌‌‌‌‌‌‌‌‌‌కు 125 ఎకరాల చొప్పున రాష్ట్రంలో 488 క్లస్టర్ల ఏర్పాటు
  • ముందుకు వచ్చిన రైతులకు రెండేండ్లు ప్రోత్సాహకాలు
  • ఎకరానికి రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం
  • రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది రైతుల సంసిద్ధత
  • ఎన్‌‌‌‌‌‌‌‌జీవోల సాయంతో రైతులకు శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సహజ వ్యవసాయం (నేచురల్ ఫామింగ్)ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను ఈ వానాకాలం సీజన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 61 వేల ఎకరాల్లో అమలు చేయనున్నారు. ఈ పథకం కింద రైతులకు రెండేళ్లపాటు ఎకరానికి ఏటా రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ పథకం అమలుకు ప్రతిపాదనలు రెడీ చేయగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. 

రాష్ట్రవ్యాప్తంగా 488 క్లస్టర్లలో ఒక్కో క్లస్టర్‌‌‌‌‌‌‌‌లో 125 ఎకరాల చొప్పున సహజ సాగును ప్రోత్సహించనున్నారు. ఇప్పటికే 50,000 మందికి పైగా రైతులు ఈ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ముందుకు వచ్చారు. వీరికి వివిధ ఎన్‌‌‌‌‌‌‌‌జీఓల సహకారంతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

జీరో బడ్జెట్ సేద్యం, మార్కెటింగ్ సౌకర్యం

ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో రసాయన ఎరువులు, పురుగుమందులను పూర్తిగా నివారించి, సహజ జీవ ఎరువులు, జీవ పురుగుమందులతో పంటలు సాగు చేయాల్సి ఉంటుంది. రైతులు సొంతంగా సహజ ఎరువులు, పురుగుమందులు తయారు చేసుకునే అవకాశం సైతం కల్పిస్తున్నారు. అలాగే, పంటలకు మార్కెటింగ్ సౌకర్యాలు, గోదాములు, కోల్డ్​ స్టోరేజీలు, హార్వెస్టింగ్ నష్టాలను తగ్గించేందుకు అధునిక టెక్నాలజీ సాయం అందించనున్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడి ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఓ (వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీ) ద్వారా ప్రత్యేక బ్రాండ్‌‌‌‌‌‌‌‌తో ఈ పంటలను మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అమ్ముకునే వసతి కల్పిస్తున్నారు. ఈ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను అందిస్తాయి. రసాయన రహిత సాగును నిర్ధారించేందుకు పంటల నమూనాలను సేకరించి ల్యాబ్‌‌‌‌‌‌‌‌లలో పరీక్షిస్తారు. మూడేళ్లు వరుసగా సహజ సాగు చేసిన రైతులకు ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో పూర్తిస్థాయి గుర్తింపు లభిస్తుంది.

ప్రత్యేక శిక్షణ, సమన్వయకర్తల నియామకం

ప్రతి క్లస్టర్‌‌‌‌‌‌‌‌లో రైతులకు సహజ సాగు విధానాలు, మార్కెటింగ్, ఆదాయ పెంపుపై ఏడాదికి కనీసం మూడు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారిని సమన్వయకర్తలుగా, రిసోర్స్ పర్సన్స్‌‌‌‌‌‌‌‌గా నియమించనున్నారు. ముఖ్యంగా కొండలు, గిరిజన ప్రాంతాల్లో తక్కువ రసాయనాలతో సాగు చేసే రైతులను ఈ పథకం కింద ఎక్కువగా ప్రోత్సహించనున్నారు. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రంలో సహజ వ్యవసాయం విస్తరించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.