- తప్పుడు స్టిక్కర్లు, తూకంలో మోసాలకు పాల్పడితే కేసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల, కొరత పేరుతో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే వ్యాపారులు, దళారుల ఆట కట్టించేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా ఉపేక్షించబోమని సివిల్సప్లయ్స్ శాఖ డైరెక్టర్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్ లాల్ వార్నింగ్ ఇచ్చారు.
మార్కెట్లో బియ్యం స్టాక్ లేదంటూ కొందరు వ్యాపారులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. రిటైలర్లకు స్టాక్ సమస్యలు ఎదురైతే హోల్‌సేల్ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారిని కలిసి అవసరమైన బియ్యం వివరాలతో ఇండెంట్ ఇస్తే, రైస్ మిల్లర్ల నుంచే సరఫరా చేయించే అవకాశం ఉందని తెలిపారు. 25 కిలోల బస్తాలపై 26 కిలోలుగా పేర్కొంటూ స్టిక్కర్లు అతికించడం, అసలు ఎంఆర్‌పీ కనిపించకుండా దానిపై అధిక ధరలతో కూడిన నకిలీ స్టిక్కర్లు వేయడం వంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. సామాన్యులపై ధరల భారం పడకుండా బియ్యం రకాలవారీగా గరిష్ట విక్రయ ధరలను సివిల్ సప్లయ్స్శాఖ నిర్దేశించింది. బీపీటీ, కేఎన్‌ఎం రకాల బియ్యం కిలో గరిష్ట ధర రూ.66గా నిర్ణయించింది. ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకాలు రూ.74కు మించకూడదని స్పష్టం చేసింది. హెచ్‌ఎంటీ, జైశ్రీరామ్ (జేఎస్‌ఆర్) రకాల బియ్యం కిలో గరిష్ట ధర రూ.79గా పరిమితం చేసింది. ఈ ధరలకు మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులు కూడా ధర, తూకం, ఎంఆర్‌పీ వివరాలను పరిశీలించి కొనాలని సూచించారు.
