- బుకింగ్స్, కన్సల్టేషన్, రేట్ల కంపారిజన్.. అన్నీ ఆన్ లైన్ లోనే
- ఆఫ్రికా, గల్ఫ్ దేశాల పేషెంట్లను రప్పించేలా ప్లాన్
- కీ రోల్ పోషించనున్న స్టేట్ మెడికల్ టూరిజం సొసైటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని గ్లోబల్ హెల్త్ డెస్టినేషన్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానా న్ని తీసుకురాబోతున్నది. విదేశాల నుంచి వైద్యం కోసం వచ్చే వారికి విమానం ఎక్కినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు అడుగడుగునా అండగా ఉండేలా మెడికల్ టూరిజం సింగిల్ విండో డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకువస్తూ.. ప్రభుత్వమే స్వయంగా ఓ క్రెడిబుల్ ఫెసిలిటేటర్‌గా వ్యవహరించనుంది.
విదేశీ పేషెంట్లు దళారుల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసు కురానున్న ఈ సింగిల్ విండో పోర్టల్ కీలకంగా పని చేయనుంది. ఏ ఆపరేషన్ కు ఏ ఆస్పత్రిలో ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి? అనే విషయాలను పేషెంట్లు ఆన్ లైన్ లోనే పోల్చి చూసుకోవచ్చు. అలాగే, హాస్పిటల్స్‌లో బెడ్ల బుకింగ్, డాక్టర్ల అపాయింట్‌మెంట్లతో పాటు దేశం దాటి రాకముందే డాక్టర్లతో వీడియోలో మాట్లాడే వెసులుబాటు ఈ ప్లాట్ ఫామ్ లో ఉండనుంది.
రాష్ట్ర మెడికల్ టూరిజం సొసైటీ పర్యవేక్షణ
ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు ప్రభుత్వం హెల్త్, టూరిజం శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టేట్ మెడికల్ టూరిజం సొసైటీని ఏర్పాటు చేయనుంది.
ఈ సొసైటీ ప్రధానంగా రెండు వర్గాలపై దృష్టి పెట్టనుంది. విదేశాల్లో సెటిల్ అయిన మన తెలుగు వాళ్లు, అలాగే ఆఫ్రికా దేశాలతో పాటు మిడిల్ ఈస్ట్(గల్ఫ్) దేశాల నుంచి వచ్చే పేషెంట్లను ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలను కోఆర్డినేషన్ చేయనున్నది. విదేశీ పేషంట్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. పేషెంట్లకు ఆపరేషన్ తర్వాత వైద్య సహాయం కోసం కూడా సర్కారు చర్యలు తీసుకోనుంది.
హాస్పిటల్స్ ను నేరుగా వెల్ నెస్ సెంటర్లు, ఎకో-టూరిజం రిసార్టులతో అనుసంధానం చేయనుననారు. అలాగే ఒత్తిడి నుంచి బయటపడేందుకు డిజిటల్ డిటాక్స్, స్ట్రెస్ రికవరీ, ప్రకృతి ఒడిలో సేదతీరేలా ప్యాకేజీలు కూడా సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం సిటీకి దగ్గరలో రిసార్టులు, టూరిస్టు ప్లేసులను మెడికల్ టూరిస్టులకు అనుగుణంగా డెవలప్ చేయనున్నారు.
అగ్రిమెంట్‌తో రేట్లపై భరోసా
విదేశీయులంటే చాలు.. ఇష్టమొచ్చిన రేట్లు వేసే దవాఖాన్లకు చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం పారదర్శకంగా ఉండే మెడికల్ టూరిజం చార్టర్ అగ్రిమెంట్ ను పబ్లిష్ చేయనుంది. ప్రభుత్వం తనిఖీ చేసి, అనుమతి ఇచ్చిన (వెరిఫైడ్ ) హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు, హోటళ్లు మాత్రమే ఇందులో ఉంటాయి.

