సర్కారు బడి పిల్లలకు పక్కా సైజు షూస్..అందించేందుకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ

సర్కారు బడి పిల్లలకు పక్కా సైజు షూస్..అందించేందుకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ
  • యూకే షూ- సైజ్ మెజరింగ్ చార్ట్‌‌‌‌తో పిల్లల పాదాల కొలతలు తీయాలి
  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు 
  • వెంటనే ఇండెంట్ పంపాలని డీఈవోలకు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు పక్కా సైజు షూస్ అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. వచ్చే 2027–28 విద్యా సంవత్సరానికి  సంబంధించి విద్యార్థుల పాదాల కొలతలు సేకరించి, జిల్లాల వారీగా ఇండెంట్ సిద్ధం చేయాలని ఆదేశించింది. గవర్నమెంట్, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల పాదాల కొలతలు తీయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా యూకే షూ-సైజ్ మెజరింగ్ చార్ట్ ఆధారంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని డీఈవోలను ఆదేశించారు.

ఏటీఎం కార్డుతో చార్ట్ చెకింగ్ 

షూ సైజుల్లో హెచ్చుతగ్గులు రాకుండా విద్యాశాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికారులు ఈ–-మెయిల్‌‌‌‌లో పంపిన స్టాండర్డ్ యూకే మెజరింగ్ చార్ట్‌‌‌‌ను డీఈవోలు ఏ4 సైజులో 100 శాతం స్కేల్‌‌‌‌తో కలర్ ప్రింట్ తీయించాలి. దాన్ని ల్యామినేషన్​చేసి లేదా హార్డ్‌‌‌‌బోర్డుపై అతికించి ఎంఈవోల ద్వారా ప్రతీ స్కూల్‌‌‌‌కు ఒక చార్ట్ పంపాలి. ప్రింట్ సైజ్ కచ్చితంగా వచ్చిందో లేదో నిర్ధారించుకునేందుకు చార్ట్‌‌‌‌లోని ప్రింట్ అక్యురసీ చెక్ బాక్స్ లో ఏటీఎం/డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పెట్టి సరిచూడాలి. కార్డు సైజుకు బాక్స్ సైజు సరిగ్గా సరిపోతేనే ఆ చార్ట్‌‌‌‌ను వినియోగించాలి.

క్లాస్ టీచర్లే కొలతలు తీయాలి

హెడ్మాస్టర్ల పర్యవేక్షణలో క్లాస్ టీచర్లే విద్యార్థుల కాళ్ల కొలతలు తీయాలి. బడి, తరగతి, షూ సైజుల వారీగా వివరాలు నమోదు చేసి నిర్దేశిత ఫార్మాట్‌‌‌‌లో స్కూల్ ఇండెంట్‌‌‌‌ను రూపొందించాలి. ఈ డేటాను  ఎంఈవోలు క్రోడీకరించి డీఈవోలకు నివేదించాలి. డీఈవోలు మండలాల వారీ డేటాను పరిశీలించడంతోపాటు, ప్రతీ మండలంలోని కొన్ని స్కూళ్లను ర్యాండమ్‌‌‌‌గా క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి డేటాలో కచ్చితత్వాన్ని నిర్ధారించుకోవాలి. అనంతరం జిల్లాల వారీ తుది నివేదికను డీఈవో సంతకంతో హార్డ్ కాపీని, ఎక్సెల్ ఫార్మాట్‌‌‌‌ను ఈ నెల10(మంగళవారం)లోగా రాష్ట్ర కార్యాలయంలో అందజేయాలని డైరెక్టర్​ సూచించారు.