సర్పంచులకు కీలక అప్‌డేట్.. గ్రామ పంచాయతీలకు కొత్త బ్యాంక్ ఖాతాలు

సర్పంచులకు కీలక అప్‌డేట్.. గ్రామ పంచాయతీలకు కొత్త బ్యాంక్ ఖాతాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సొంత ఆదాయం (ఓఎస్ఆర్​), ఖర్చుల నిర్వహణ కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి.దివ్య కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం పంచాయతీలకు వచ్చే అన్ని రకాల ఆదాయాలు, నిధులను వెంటనే జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేయాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగా జీపీల సొంత ఆదాయం, వ్యయాల కోసం ప్రత్యేకంగా ‘జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలు’ ప్రారంభించాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను (డీపీఓలను) ఆదేశించారు. జీపీల నూతన ఖాతాల నిర్వహణ బాధ్యతలను ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 31 జిల్లాలను ఈ రెండు బ్యాంకులకు విభజించారు.సంబంధిత డీపీఓలు ప్రక్రియను స్పీడప్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.