సిటీని ముంచెత్తిన వాన.. మరో మూడ్రోజులు వానలు

సిటీని ముంచెత్తిన వాన.. మరో మూడ్రోజులు వానలు
  • మంగళవారం సాయంత్రం నుంచి కుండపోత
  • తిరుమలగిరి,ఉప్పల్‌‌లో 12 సెం.మీ.లకుపైగా నమోదు
  • అనేక కాలనీల్లో ఇండ్లోకి నీళ్లు
  • పొంగిన నాలా లు, కొట్టు కుపోయిన బైకులు
  • రాష్ట్రవ్ యాప్తం గా అన్ని జిల్లాల్లో వానలు
  • పెద్దపల్లిలో 13 సెం టీమీటర్ల వర్షపాతం
  • మరో మూడ్రోజులు వర్షాలు: వాతావరణ శాఖ

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రేటర్‌‌ హైదరాబాద్ సిటీని వాన ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు తెరిపిలేని వాన కురిసింది. రాత్రి 10.30 గంటల వరకు ఉప్పల్‌‌లో అత్యధికంగా 12 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 4 సెం.మీ.ల నుంచి 12 సెం.మీ.ల వరకు వర్షపాతం రికార్డయ్యింది.  గచ్చిబౌలి, హైటెక్‌‌సిటీ, పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్‌‌పల్లి, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, నాచారం, ఈసీఐఎల్, బోయిన్‌‌పల్లి సహా చాలా చోట్ల కుండపోత వాన పడింది. దీంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. వాహనదారులు అవస్థలు పడ్డారు. పలు చోట్ల బైక్‌‌లు కొట్టుకుపోయాయి. ఆఫీసులు పూర్తయ్యే సమయానికి వర్షం కురవడంతో నగరంలోని అన్ని రోడ్లపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫ్లైఓవర్లపైనా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో అన్ని చోట్ల మ్యాన్‌‌ హోళ్లను తెరిచి ఉంచారు. జీహెచ్‌‌ఎంసీ సిబ్బంది రోడ్లపై ఉండి నీటి మళ్లింపు పనులు చేపట్టారు. ఐదారు గంటల్లోనే ఇంత భారీ వర్షం కురవడంతో కాలనీ రోడ్లు కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీళ్లు చేరాయి.

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు

హైదరాబాద్‌‌తో పాటు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. అనేక చోట్ల భారీ వర్షాలు, ఒక చోట అతి భారీ వర్షం పడింది. 13 ప్రాంతాల్లో భారీగా, 180 చోట్ల మోస్తరు వానలు, 227 చోట్ల తేలికపాటి,149 ప్రాంతాల్లో అతి తేలికపాటి జల్లులు కురిశాయి. రంగారెడ్డి జిల్లాలోని మంఖల్‌‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు 13.55 సెం.మీ., మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 13.33 సెం.మీ.. రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 11.80 సెం.మీ.. నిజామాబాద్‌‌ జిల్లా చిమన్‌‌పల్లిలో 9.55 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది.

నేడు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు

రానున్న మూడురోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. దక్షిణ ఆంధ్ర, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, నైరుతి మధ్యప్రదేశ్ వరకు విదర్భ మీదుగా 0.9 ఎత్తు వరకు ద్రోణి ఏర్పడినట్లు చెప్పింది.