ఢిల్లీలో ఘోర విషాదం.. గోడ కూలి 8 మంది దుర్మరణం.. భారీ వర్షాలతో ఢిల్లీ ఆగమాగం

ఢిల్లీలో ఘోర విషాదం.. గోడ కూలి 8 మంది దుర్మరణం.. భారీ వర్షాలతో ఢిల్లీ ఆగమాగం

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోర విషాదం జరిగింది. ఢిల్లీలోని జైత్పూర్ ఏరియాలోని హరి నగర్లో శనివారం గోడ కూలి 8 మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదానికి కారణమైంది. చనిపోయిన వాళ్లలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం మరింత కలచివేసే విషయం. ఒక పాత ఆలయం గోడ కూలింది. ఆ గోడకు ఆనుకుని గుడారాలేసుకుని ఉంటున్న పేదలు ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు. వీళ్లలో ఎక్కువ మంది చెత్త అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఉన్నట్టుండి గోడ కూలడంతో తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.

అప్పటికీ కొందరు స్వల్ప గాయాలతో బయటపడగలిగారు. 8 మంది ప్రాణాలను మాత్రం ఆ కూలిన గోడ బలి తీసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈ 8 మందిని సమీపంలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్, ఎయిమ్స్ (AIIMS) హాస్పిటల్స్కు హుటాహుటిన తరలించి చికిత్స అందించారు. అయితే.. చికిత్స పొందుతూ 8 మంది చనిపోవడం శోకాన్ని మిగిల్చింది. చనిపోయిన వారిని.. షబీబుల్ (30), రబీబుల్ (30), ముత్తు అలీ (45), రుబీనా (25), డాలీ (25), హషీబుల్, రుక్సానా (6), హసీనాగా(7) పోలీసులు గుర్తించారు.

ఇలాంటి ఘటనలు జరగకుండా అలాంటి జుగ్గీలను (పేదల గుడారాలు) ఖాళీ చేయిస్తామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఐశ్వర్య శర్మ తెలిపారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి కురిసిన వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేశాయి. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రక్షా బంధన్ రోజు కూడా భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో వరద ఏరులై పారింది. ఢిల్లీలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. శనివారం ఉదయం ఢిల్లీలో 8.30 గంటలకు వర్షం కురుస్తున్న సమయానికి.. సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 78.7 mm వర్షపాతం నమోదైంది.

ప్రగతి మైదాన్ ప్రాంతంలో 100 mm వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఢిల్లీలో యమునా నది నీటిమట్టం 204.50 మీటర్లకు చేరుకుని ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో.. వరద ముంపును వీలైనంత నివారించడానికి ప్రభుత్వం, ఏజెన్సీలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.