- ప్రైవేట్ లెక్కనే గవర్నమెంట్ హాస్పిటల్స్‌కూ నిధులు రిలీజ్
- ప్రతిపాదనలు రెడీ చేసిన ఆఫీసర్లు.. త్వరలోనే గ్రీన్ సిగ్నల్
- ఎంఎన్‌జే, నిమ్స్, ఉస్మానియా, గాంధీకి నెలకు రూ. కోటి చొప్పున జమ
- మెడికల్ కాలేజీలకు 20 లక్షలు, ఏరియా హాస్పిటల్స్‌కు 10 లక్షలు
- ప్రస్తుతం రూ. 420 కోట్ల బకాయిలు.. కొత్త విధానంతో చెక్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌కు నెలనెలా ఠంచన్‌గా ఆరోగ్య శ్రీ నిధులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ప్రతినెలా రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్టుగానే ఇకపై గవర్నమెంట్ హాస్పిటల్స్ కు కూడా అదే రీతిలో ఫండ్స్ఇచ్చేందుకు రెడీ అయింది. నిధుల కొరతతో మందులు కొనలేక, పరికరాలు బాగు చేయించలేక, చేసిన పనికి ఇన్సెంటివ్స్ రాక సతమతమవుతున్న వైద్యాధికారుల మనోవేదనను తీర్చేందుకు సిద్ధమవుతున్నది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే ఆరోగ్యశ్రీ నిధులను రివాల్వింగ్ ఫండ్ కింద జమ చేయనున్నారు. వీటిని హాస్పిటల్ స్టోర్‌లో అందుబాటులో లేని ఖరీదైన మందులు, సర్జికల్ ఇంప్లాంట్లు (స్టంట్లు, ప్లేట్లు), ఇతర ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్ బయట నుంచి కొనుగోలు చేయడానికి, స్కానింగ్ మిషన్ల రిపేర్లు, హాస్పిటల్ శానిటేషన్, సర్జరీలు, ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్లు, స్టాఫ్‌కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు వినియోగిస్తారు.
పెద్ద హాస్పిటల్స్‌కు నెలకు కోటి..
అధికారులు పంపిన ప్రతిపాదనల ప్రకారం.. పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉండే హాస్పిటల్స్ కు ప్రతినెలా ఫిక్స్‌డ్ అమౌంట్ జమ కానున్నది. టీచింగ్ హాస్పిటల్స్ అయిన నిమ్స్, ఎంఎన్‌జే, ఉస్మానియా, గాంధీకి ప్రతినెలా రూ. కోటి, జిల్లాల్లో ఉన్న మెడికల్ కాలేజీలకు ప్రతినెలా రూ. 20 లక్షలు చెల్లించనున్నారు. అలాగే టీవీవీపీ (విధాన పరిషత్) హాస్పిటల్స్‌కు ప్రతినెలా రూ. 10 లక్షలు.. ఇలా ప్రతినెలా కొంత మొత్తం చెల్లించడం వల్ల పాత బకాయిలు మెల్లగా క్లియర్ అవ్వడంతోపాటు హాస్పిటల్స్ నిర్వహణకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
బకాయిల కొండను కరిగించేందుకు..
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం ప్రతినెలా సుమారు రూ. 100 కోట్లు రిలీజ్ చేస్తున్నది. కానీ.. సర్కారు హాస్పిటల్స్ పరిస్థితి మాత్రం ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా ఉంది. దీంతో హాస్పిటల్స్ నిర్వహణ కష్టంగా మారింది. ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు రావాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలే సుమారు రూ. 420 కోట్ల దాకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిల కొండను కరిగించేందుకు, ప్రభుత్వ హాస్పిటల్స్‌ను గాడిన పెట్టేందుకు మంత్లీ పేమెంట్ సిస్టమ్‌ను తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

