నియోజకవర్గానికో మోడ్రన్ ధోబీఘాట్..యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నం: మంత్రి పొన్నం ప్రభాకర్

నియోజకవర్గానికో మోడ్రన్ ధోబీఘాట్..యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్/బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 మోడ్రన్​ ధోబీఘాట్ లను ఏర్పాటు చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెలూన్లు బ్యూటీపార్లర్​లుగా మారుతున్నట్టుగానే.. ధోబీఘాట్లు అధునాతన డ్రై క్లీనింగ్ యూనిట్లుగా మారాలని అభిప్రాయపడ్డారు.

షాద్ నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం సెక్రటేరియెట్​లో రజక వృత్తిదారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రజకుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో రజక వృత్తిదారుల సమస్యలపై కలెక్టర్ దాసరి హరిచందనతో మాట్లాడారు. త్వరలోనే హైదరాబాద్​లో తొమ్మిది మోడ్రన్​ ధోబీఘాట్ లు నిర్మించబోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుతమున్న12 ధోబీఘాట్లలో సమస్యలను గుర్తించి మరమ్మతులు చేపట్టనున్నట్టు తెలిపారు. బేగంపేట ధోబీఘాట్ పై రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. కుల వృత్తిదారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. చాలా జిల్లాల్లో రజక వృత్తిదారులకు కేటాయించిన భూమిపై వస్తున్న ఇబ్బందులను జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు, కలెక్టర్లు సమన్వయం చేసుకొని పరిష్కరించాలన్నారు. సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయదేవి, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్డీవో, బీసీ వెల్ఫేర్​ శాఖ ఆఫీసర్లు, రజక వృత్తిదారుల సంఘం నేతలు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ పాస్ పోర్ట్ తీసుకోవాలి

ఆధార్ కార్డులాగే ప్రతిఒక్కరూ పాస్ పోర్ట్  తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్  అన్నారు. హైదరాబాద్  ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ ప్రాంగణంలో పాస్ పోర్ట్  సేవా కేంద్రాన్ని పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్  ఒవైసీ, హైదరాబాద్  కలెక్టర్  దాసరి హరిచందన, మేయర్ గద్వాల విజయలక్ష్మి , రీజినల్ పాస్ పోర్ట్  అధికారి స్నేహజ ప్రారంభించారు.  పాస్ పోర్ట్  కార్యాలయంలో ఉద్యోగులతో మంత్రి, ఎంపీ మాట్లాడారు. రోజూ వస్తున్న స్లాట్లు, పాస్ పోర్ట్ దారులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం   మాట్లాడారు. తెలంగాణలో ఐదు పాస్ పోర్ట్  కేంద్రాలు ఉన్నాయని, బేగంపేట ప్రధాన పాస్ పోర్ట్  కేంద్రంగా ప్రజలకు సేవలు అందిస్తున్నదన్నారు.

 రాష్ట్రంలో రోజుకు 4,500  పాస్ పోర్టులు ఇచ్చే సామర్థ్యం ఉందన్నారు. గతంలో గల్ఫ్  దేశాలకు కార్మికుల మాదిరిగా వెళ్ళేవారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్య, ఉపాధి అవకాశాల నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారన్నారు. దీనికి తోడు టూరిజం కోసం కూడా విదేశాలకు చాలా మంది వెళ్తున్నారని, భారతీయుడిగా గుర్తింపు ఉండడానికి పాస్ పోర్ట్  అందరూ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగా పాస్ పోర్ట్  వెరిఫికేషన్ లో పోలీసుల జాప్యం ఉండదని, ఎవరైనా పాస్ పోర్ట్  కోసం అప్లై చేయగానే వెంటనే వెరిఫికేషన్  పూర్తి చేసుకుని పాస్ పోర్ట్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.