తెలంగాణ మొత్తం అప్పులు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు

తెలంగాణ మొత్తం అప్పులు  రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు

అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేసింది కాంగ్రెస్ సర్కార్.  తెలంగాణ బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి 20 శాతం తేడా ఉందని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉందంది. 2014- 15 లో అప్పు 72 వేల 658 కోట్లు ఉండగా... ప్రస్తుతం 6లక్షల 71 వేల 757 కోట్లకు అప్పు చేరింది. పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు. రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగింది. రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్లినట్లు తెలిపింది. 

2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గింది. విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది. రోజువారి ఖర్చులకు కూడా ఆర్బిఐ పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణమైంది. అయితే తాము మాత్రం 6 గ్యారంటీలను అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నామని తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపింది.

పెద్దగా ఆదాయం లేని కార్పొరేషన్లకు అధిక వడ్డీతో రుణాలు తీసుకుంది గత సర్కార్. 95శాతం అప్పులు 5 కార్పొరేషన్ల మీద తీసుకుంది. మార్కెట్ వడ్డీ 7.63% కంటే ఎక్కువగా 10.49% వడ్డీతో అప్పులు తీసుకుంది. భారీ వడ్డీలతో సర్కార్ కు గుదిబండగా మారాయి అప్పులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 9.69% ఇంట్రెస్ట్ రేటుతో 74వేల 599 కోట్లు అప్పు తీసుకుంది. 9.48% ఇంట్రెస్ట్ రేటుతో తెలంగాణ డ్రికింగ్ వాటర్ కార్పొరేషన్ పై 20,200 కోట్ల లోన్ తీసుకుంది. 10.49% ఇంట్రెస్ట్ తో వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ పై 14వేల 60 కోట్ల అప్పు చేసింది. దీనిపైనే అత్యధికంగా వడ్డీ రేట్లు చెల్లిస్తోంది సర్కార్. హౌసింగ్ కార్పొరేషన్ పై లోన్ 6,470కోట్లు, ఇటు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై లోన్ 2,951కోట్లు అప్పు చేసింది గత సర్కార్.

  • రాష్ట్ర మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు.
  • 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ. 72,658 కోట్లు.
  • 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.
  • 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ. 3,89,673 కోట్లు.
  • 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.
  • 2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.
  • బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం.
  • 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ. 4.98 లక్షల కోట్ల వ్యయం.
  • రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.
  • రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం
  • రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం