జపాన్ను దాటేశాం.. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : నీతి ఆయోగ్

జపాన్ను దాటేశాం.. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : నీతి ఆయోగ్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా దూసుకుపోతున్న ఇండియా.. లేటెస్ట్ గా మరో మైలు రాయిని దాటింది. జపాన్ ను అధిగమించి 4వ స్థానానికి చేరుకుందని నీతి ఆయోగ్ సీఈఓ  బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. 
 
నీతి ఆయోగ్10వ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, భౌగోలిక పరిస్థితులు ఇండియాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇండియా 4 ట్రిలియన్ డాలర్ల కు చేరుకుందని, 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం ప్రకటించారు.

ఐఎంఎఫ్ (iMF) డేటా ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థ జపాన్ ను అధిగమించిందని ప్రెస్ మీట్ లో తెలిపారు. అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందున్నాయని చెప్పారు. ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకున్న ప్రణాళికలను, ప్లాన్ లను ఇదే విధంగా అమలు చేసుకుంటూ పోతే 2 నుంచి 3 ఏళ్లలో ఇండియా 3వ ఆర్థిక శక్తిగా ఎదగటం సాధ్యమేనని అన్నారు. 

త్వరలో యూఎస్ లో అమ్మబోయే ఐ ఫోన్ లు ఇండియాలో కాకుండా యూఎస్ లోనే తయారు చేస్తారని భావిస్తున్నానని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు సీఈఓ సుబ్రహ్మణ్యం. టారిఫ్ లు ఏవైనా.. తయారీ రంగానికి భారత్ చాలా చవకైన (చీప్) దేశమని, ఇక్కడ తయారు చేయడం ద్వారా లబ్ది పొందుతారు అనేది కంపెనీలకు తెలిసే ఉంటుందని అన్నారు. 

ఐఎంఎఫ్ వరల్డ్ ఎకానమిక్ అవుట్ లుక్ ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరానికి భారత్ నామినల్ జీడీపీ సుమారు 4,187.017 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఏప్రిల్ ఎడిషన్ అంచనా వేసింది. జపాన్ అంచనా వేసిన 4,186.431 బిలియన్ డాలర్ల జీడీపీని కొద్దిగా అధిగమించింది.

ఇప్పటి వరకు ఇండియా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. లేటెస్ట్ గా ప్రపంచ ఆర్థిక సంస్థ అంచనా ప్రకారం రాబోయే రెండేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఇప్పటికే అంచనా వేసింది.

2025లో భారత ఆర్థిక వ్యవస్థ 6.2 శాతం, 2026లో 6.3 శాతం వృద్ధి చెందుతుందని ప్రపంచ, ప్రాంతీయంగా ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది.

అంతే కాకుండా గ్లోబల్ ఎకానమీ 2025లో 2.8 శాతం, 2026 లో 3.0 శాతంగా ఉండనుందని ఐఎఫ్ అంచనా వేసింది. అంటే భారత ఆర్థిక వృద్ధి కంటే తక్కువగానే ఉందని ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో తెలిపారు.