బడ్జెట్ 2025-26 రిపోర్ట్ కార్డ్: ఇంకా అమలుకాక పెండింగ్‌లో ఉన్న స్కీమ్స్ ఇవే..

బడ్జెట్ 2025-26 రిపోర్ట్ కార్డ్: ఇంకా అమలుకాక పెండింగ్‌లో ఉన్న స్కీమ్స్ ఇవే..

పట్టుమని వారం రోజులు కూడా లేదు ఫిబ్రవరి 1న కొత్త బడ్జెట్ ప్రసంగానికి. ఈ క్రమంలో చాలా మంది కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారు. ఏఏ రంగాలకు ప్రయోజనం ఉంటుంది. సామాన్యుల నుంచి బిజినెస్ పీపుల్ వరకూ తమ కోరికల చిట్టాలతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అసలు గత బడ్జెట్లో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలకే పూర్తి స్థాయిలో అమలు జరగలేదని తేలింది. 2025 బడ్జెట్లో అమలు కాక పేపర్లకే పరిమితమైన కొన్ని హామీలు అలాగే మరికొన్ని తూతూమంత్రంగా స్టార్ట్ అయినవి ఉన్నట్లు తేలింది. దీనికి కారణాలేంటి, వాటికి సంబంధించిన వివరాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం...

స్టార్టప్‌లకు ఫండ్ ఆఫ్ ఫండ్స్:

స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.10వేల కోట్లతో కొత్త ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ ప్రకటించింది. గతంలో 2016లో ప్రారంభించిన ఇలాంటి నిధి ద్వారా రూ.91వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే తాజా నిధికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం, మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉంది. అలాగే AI వంటి రంగాల కోసం 'డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్' ఏర్పాటును కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

వ్యవసాయం:

ప్రభుత్వం వ్యవసాయాన్ని వృద్ధికి 'మొదటి ఇంజన్'గా చెప్పినప్పటికీ కొన్ని కీలక స్కీమ్స్ ఇంకా ప్రారంభం కూడా కాలేదు. 'ఫార్మ్ టు ఫారిన్' విజన్‌తో పత్తి ఉత్పాదకతను పెంచే 5 ఏళ్ల కాటన్ మిషన్ ఇంకా అమలులోకి రాలేదు. వాతావరణ మార్పులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే విత్తనాల కోసం ఉద్దేశించిన హై-యీల్డింగ్ సీడ్స్ మిషన్ కూడా పెండింగ్‌లోనే ఉంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. అయితే దీనిపై ఒక కమిటీ పరిశీలన చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

యువతకు జాబ్ స్కీమ్స్:

యువత కోసం తెచ్చిన రెండు కీలక పథకాలు ఆరంభంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద కొత్త ఉద్యోగాల సృష్టి కోసం రూ. 99వేల 446 కోట్లు కేటాయించినా, ఎంఎస్ఎంఈల నుంచి స్పందన తక్కువగా ఉంది. అవగాహన లోపం, డాక్యుమెంటేషన్ కష్టంగా ఉండటమే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇక పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ స్కీమ్ విషయానికి వస్తే.. అక్టోబర్ 2024లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన నాటి నుంచి కేవలం 20 శాతం మంది అభ్యర్థులే ఆఫర్లను అంగీకరించారు. శిక్షణా కాలం 12 నెలలు ఉండటం, నివాస ప్రాంతాలకు దూరంగా కంపెనీలు ఉండటంతో చాలా మంది మధ్యలోనే తప్పుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్టైపెండ్ పెంచడం, శిక్షణ కాలాన్ని తగ్గించడం వంటి మార్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ప్రకటించిన పథకాలు కాగితంపై అద్భుతంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడానికి మరికొంత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ పథకాలు పూర్తిస్థాయిలో ఊపందుకుంటాయని ఆశించటం తప్ప సామాన్య భారతీయుల ముందు మరో అవకాశం లేదు. అయితే కొత్త బడ్జెట్లో ఎలాంటి స్కీమ్స్ ప్రకటిస్తారో చూడాలి రానున్న కాలంలో.