భారతదేశంలో క్రిప్టో కరెన్సీల గురించి ప్రభుత్వం ఒకేసారి పూర్తి స్థాయి విధానాన్ని ప్రకటించలేదు. బదులుగా 2022 నుంచి వరుస బడ్జెట్‌ల ద్వారా పన్ను నిబంధనలను కఠినతరం చేస్తూ.. ఈ రంగాన్ని పర్యవేక్షించడం మొదలుపెట్టింది. ప్రభుత్వం దృష్టిలో క్రిప్టో అంటే కేవలం లాభాలు వచ్చే మార్గం మాత్రమే కాదు, అది ఆర్థిక నేరాలకు తావులేని విధంగా పారదర్శకంగా మార్చాలన్నది ప్రధాన ఉద్దేశ్యం.
నిజానికి 2022 బడ్జెట్ క్రిప్టో రంగానికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అంతకుముందు వరకు క్రిప్టో అసలు చట్టబద్ధమా కాదా? అనే అనుమానాలు చాలా మంది ఇన్వెస్టర్లలో ఉండేది. కానీ 2022లో కేంద్రం సెక్షన్ 115BBH కింద క్రిప్టో లాభాలపై 30% పన్ను విధించింది. అంతేకాకుండా ప్రతి లావాదేవీపై 1% TDS వసూలు కోసం సెక్షన్ 194S నిబంధనను తెచ్చింది. దీంతో క్రిప్టోను ప్రభుత్వం గుర్తించి, అధికారికంగా పన్ను పరిధిలోకి తెచ్చింది. అలాగే ప్రతి లావాదేవీకి ఒక డేటా ట్రైల్ ఏర్పడటం వల్ల ఆర్థిక నేరాల ప్రమాదం తగ్గింది.
అగ్రస్థానంలో భారత్: గ్లోబల్ అడాప్షన్
పన్నులు భారంగా ఉన్నప్పటికీ.. భారతీయులు క్రిప్టోపై చూపిస్తున్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. 2024-25లో గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్‌లలో భారత్ నెం.1 స్థానంలో ఇండియా నిలిచింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆన్-చైన్ లావాదేవీల విలువ 2025 జూన్ నాటికి 2.36 ట్రిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం. దేశీయంగా స్పష్టమైన చట్టాలు లేకపోయినా.. భారతీయులు ఈ సాంకేతికతను భారీగా అంగీకరిస్తున్నారని ఇది నిరూపిస్తోంది.
►ALSO READ | చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంలోనే రూ.10, రూ.20 నోట్లు.. మార్కెట్లోకి సరికొత్త 'హైబ్రిడ్' మిషన్లు..?
ఇప్పటి వరకూ క్రిప్టోల విషయంలో జరిగిన ప్రోగ్రస్ పక్కన పెడితే ఇప్పుడు అందరి దృష్టి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ పైనే కొనసాగుతోంది. 2026 బడ్జెట్ లో క్రిప్టో పరిశ్రమకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయనేదానిపై చర్చ కొనసాగుతోంది. కేవలం పన్నులు వసూలు చేయడమే కాకుండా, ఈ రంగాన్ని క్రమబద్ధీకరించాలని నిపుణులు కోరుతున్నారు. ప్రధానంగా మూడు అంశాలపై క్లారిటీ కావాలని పరిశ్రమ కోరుతోంది.
1. ఒకే నియంత్రణ సంస్థ: మార్కెట్ నిర్వహణ, కస్టడీ స్టాండర్డ్స్, వినియోగదారుల రక్షణ కోసం ఒక ప్రత్యేక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి.
2. పన్నుల మార్పు: 1% TDS వల్ల మార్కెట్లో లిక్విడిటీ తగ్గుతోంది. దీనివల్ల ఇన్వెస్టర్లు విదేశీ ఎక్స్ఛేంజీల వైపు వెళ్తున్నారు. ఈ రేటును తగ్గించి దేశీయంగా కార్యకలాపాలు సాగేలా చూడాలి.
3. ఇన్నోవేషన్ హబ్: టోకనైజేషన్, ఆన్-చైన్ ఫైనాన్స్ పైలట్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలి. కేవైసీ, ఏఎంఎల్ నిబంధనలను పాటించే సంస్థలకు సులభంగా బిజినెస్ చేసుకునే అవకాశం కల్పించాలి.
దేశం దగ్గర కావాల్సినంత టాలెంట్, టెక్నాలజీ ఉంది. 2026 బడ్జెట్‌లో ఒక సమతుల్యమైన విధానాన్ని ప్రకటిస్తే.. భారత్ ప్రపంచ క్రిప్టో మ్యాప్‌లో కేవలం వినియోగదారుగానే కాకుండా ఒక ఇన్నోవేషన్ హబ్ గా మారుతుందని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడ్డారు. మారుతున్న పెట్టుబడి తీరుతెన్నులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని క్రిప్టోలను మరింత సురక్షితమైన, రెగ్యులేటెడ్ పెట్టుబడి మార్గంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
