- ఇవాళ నేడు వెబ్‌సైట్, ఆన్‌లైన్ హోమ్‌స్టే రిజిస్ట్రేషన్ పోర్టల్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పర్యాటక రంగాన్ని సాంకేతిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆధునిక డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం మాదాపూర్ శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో ‘డిజిటల్ అజెండా–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పర్యాటక రంగానికి కొత్తరూపు’ నినాదంతో వేడుకలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ), భాషా సాంస్కృతిక శాఖ, పురావస్తు శాఖ, నిథమ్, సాహిత్య, సంగీత నాటక అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు.
అత్యాధునిక డిజిటల్ సేవలు షురూ..
పర్యాటక శాఖ రూపొందించిన పలు డిజిటల్ సేవలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా అత్యాధునిక హంగులతో పునర్ రూపకల్పన చేసిన ‘తెలంగాణ టూరిజం’ అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించనున్నారు. గ్రామీణ జీవన విధానాన్ని పరిచయం చేసేందుకు రూపొందించిన ‘ఆన్‌లైన్ హోమ్‌స్టే రిజిస్ట్రేషన్ పోర్టల్’ను ప్రారంభించనున్నారు.
సాంకేతికతతో కూడిన ఇంటరాక్టివ్ ఏఆర్, వీఆర్(ఆగ్మెంటెడ్ రియాలిటీ/వర్చువల్ రియాలిటీ) లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కాఫీ టేబుల్ బుక్‌తోపాటు కొత్త టూరిజం ట్రైలర్లు, ‘మై తెలంగాణ, మై స్టోరీ, మై డెస్టినేషన్’ ప్రచార పోస్టర్లు, ఎకో టూరిజం వీడియోలను విడుదల చేయనున్నారు.
ఏఎస్‌ఐ, పురావస్తు శాఖల మధ్య ఒప్పందం..
తెలంగాణ చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను సంరక్షించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ), తెలంగాణ పురావస్తు శాఖల మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) జరగనుంది. అనంతరం పర్యాటక రంగంలో అత్యుత్తమ సేవలందించిన వారికి ఎక్సలెన్స్ అవార్డులు, ప్రశంసా పత్రాలను సీఎం అందజేయనున్నారు.
కార్యక్రమంలో యువ టూరిజం క్లబ్‌ల విద్యార్థులు, టూరిస్ట్ పోలీసులు, తెలంగాణ దర్శిని ప్రతినిధులు, శిక్షణ పొందిన గైడ్లు తమ అనుభవాలను పంచుకోనున్నారు. ముగింపులో సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి.
