బాధితులు అందర్నీ ఆదుకుంటాం.. తక్షణ సాయంగా రూ.7 లక్షలు : మంత్రి పొన్నం

బాధితులు అందర్నీ ఆదుకుంటాం.. తక్షణ సాయంగా రూ.7 లక్షలు : మంత్రి పొన్నం

చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను.. చికిత్స పొందుతున్న బాధితులు అందర్నీ ఆదుకుంటాం అని ప్రకటించారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 2025, నవంబర్ 3వ తేదీన బస్సు, టిప్పర్ యాక్సిడెంట్ జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించి.. బాధితులను ఓదార్చారాయన. 

చనిపోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు.. ఆర్టీసీ తరపున 2 లక్షల రూపాయలు.. మొత్తం 7 లక్షల రూపాయలను తక్షణ సాయంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు 2 లక్షల రూపాయల ఆర్థిక తక్షణ సాయం ప్రకటించిన మంత్రి.. బాధితులకు మెరుగైన వైద్యం అందించనున్నట్లు స్పష్టం చేశారాయన. చికిత్స కోసం అవసరం అయితే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ వైద్యం అందిస్తామని.. బాధితులకు అండగా నిలబడతాం అని భరోసా ఇచ్చారాయన. 

తక్షణ కర్తవ్యంగా బాధితులను ఆదుకోవటమే ప్రాధాన్యతగా పెట్టుకున్నాం అని.. రాజకీయాలు మాట్లాడే సమయం ఇది కాదన్నారాయన. ఈ యాక్సిడెంట్ పై ఇప్పటికే విచారణకు ఆదేశించాం అని.. ప్రమాదానికి కారణం ఏంటీ.. ఎవరిది తప్పు అనేది ఆ విచారణ కమిటీ తేల్చుతుందన్నారు మంత్రి పొన్నం. 

ప్రమాదంలో 19 మంది చనిపోయారని.. మరో 14 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. వీరిలో నలుగురి ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించిన మంత్రి.. మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారాయన. చనిపోయిన వారి అంత్యక్రియలు జరిగే వరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని.. ఒక్కో కుటుంబానికి ఒక్కో అధికారిని నియమించామని  స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.