- ఏజెన్సీ ఏరియాల్లో 1,024 కిలోమీటర్ల రోడ్లు, 112 బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు
- ఇప్పటికే 37 రోడ్లు, 50 బ్రిడ్జిలు పూర్తి చేసిన ప్రభుత్వం
- కొనసాగుతున్న మరో 58 రోడ్లు, 43 బ్రిడ్జిల నిర్మాణ పనులు
- వీటిని సైతం మార్చి 31 నాటికి పూర్తి చేసేలా ప్రయత్నాలు
హైదరాబాద్, వెలుగు : ఇన్నాళ్లు మట్టి, బురద రోడ్లపై పయనిస్తూ, వాగులు, వంకలు దాటుకుంటూ ఇబ్బందులు పడిన వందలాది గిరిజన గ్రామాల ప్రజల రవాణా కష్టాలు తొలగిపోయాయి. కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాలకు రోడ్డు, అవసరమైన చోట బ్రిడ్జిల నిర్మాణ పనులను చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 37 బీటీ రోడ్లు, 50 బ్రిడ్జిల పూర్తికాగా.. మరో 58 రోడ్లు, 43 బ్రిడ్జిల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పూర్తి అయిన రోడ్లతో వందలాది గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగైంది.
పెండింగ్‌లో ఉన్న పనులను సైతం వచ్చే ఏడాది మార్చి 31లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇవి కూడా పూర్తి అయితే మరో రెండు, మూడు వందల గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కలగనుంది.
2017 నుంచి మొదలు..
రాష్ట్రంలో అభివృద్ధి చెందని, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1,398 కోట్ల నిధులు కేటాయించాయి. ఈ నిధులతో ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 1,024 కిలోమీటర్ల దూరం రోడ్లు, 112 బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించారు.
మొత్తం నిధుల్లో కేంద్రం వాటా రూ.734 కోట్లు కాగా.. మిగిలిన రూ.664 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. 2017–18 నుంచి 2022–23 వరకు నిధులు విడుదల చేశారు. అయితే అటవీశాఖ అనుమతులు రాని కారణంగా 51 పనులకు సంబంధించిన 250 కిలోమీటర్ల రోడ్లు, 19 బ్రిడ్జిల నిర్మాణ పనులను క్యాన్సిల్ చేశారు.
రూ.687 కోట్లతో 87 పనులు పూర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మారుమూల అటవీ గ్రామాల్లో చేపడుతున్న పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. పనులను స్పీడ్‌గా చేయాలని ఇంజినీర్లు, ఆఫీసర్లను ఆదేశించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.687 కోట్లతో చేపట్టిన 87 పనులను ఇప్పటికే కంప్లీట్ చేశారు. ఇందులో 477 కిలోమీటర్ల దూరం బీటీ రోడ్డు వేయగా... అవసరమైన చోట 50 బ్రిడ్జిలను నిర్మించారు.
కొత్తగూడెం జిల్లాలో 25, అసిఫాబాద్‌లో 20, మంచిర్యాలలో 20, ములుగులో 17, భూపాలపల్లి జిల్లాలో ఐదు పనులు కంప్లీట్ చేసినట్లు ఆర్‌అండ్‌బీ ఆఫీసర్లు ప్రకటించారు. ఇంకా 297 కిలోమీటర్ల దూరం నిర్మిస్తున్న 58 రోడ్లు, 43 బ్రిడ్జిల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 రోడ్లు, 12 వంతెనలు, భూపాలపల్లి జిల్లాలో రెండు రోడ్లు, ఒకటి బ్రిడ్జి, అసిఫాబాద్ జిల్లాలో నాలుగు బ్రిడ్జిలు, ఒక రోడ్డు, మంచిర్యాల జిల్లాలో ఒక బ్రిడ్జి, రెండు రోడ్లు, ములుగు జిల్లాలో ఎనిమిది రోడ్లు, 11 బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. ఈ పనులను మార్చి 31లోగా కంప్లీట్ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.
మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థ
ఒకప్పుడు ఏజెన్సీ గ్రామాలకు ఏదైనా వాహనంపై వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రభుత్వ అంబులెన్స్‌లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ సైతం నడిచేవి కావు. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే వాగులు, వంకలు దాటుకుంటూ పోవాల్సి రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించడంతో రవాణా వ్యవస్థ మెరుగుపడి ప్రజల కష్టాలు తొలగిపోయాయి.
గతంలో బస్సులు లేకపోవడంతో చాలా మంది స్టూడెంట్లు ఉన్నత చదువులకు వెళ్లలేక మధ్యలోనే ఆపేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం బస్సులు నడుస్తుండడంతో గిరిజన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర గ్రామాలకు వెళ్తున్నారు. అలాగే రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి నిత్యావసర సరుకుల రవాణాకు బయటకు వెళ్లి వస్తున్నారు.
ఆర్టీసీ బస్సు వస్తాంది
వర్షాకాలం వస్తే నాలుగైదు నెలలు పలిమెల మండలంలోని పదూర్లు ప్రపంచానికి దూరమయ్యేవి. పెద్దంపేట వాగు, రాళ్లవాగు, మోదేడు వాగు, పెద్ద వాగులు ఉప్పొంగేది. గోదావరి కమ్ము వచ్చి వాగు నిండా నీళ్లు పారేది. అది దాటే ప్రయత్నం చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. పాము కాటో అయితే మనిషి ప్రాణాల మీద ఆశ కోల్పోయేటోళ్లు. తిండి గాసానికి కూడా కచ్చడం కట్టుకుని మహదేవపూర్ పోవాల్సి వచ్చేది. ఇప్పుడు మహాదేవపూర్ – కాటారం రోడ్డు కావడంతో ఆటోలు మొదలైనయ్. ఇప్పుడు మా పలిమెల ఊరుకు ఆర్టీసీ బస్సు ఆరు ట్రిప్పులు వస్తాంది.
- జనగామ అశోక్, పలిమెల, భూపాలపల్లి-
దశాబ్దాల కష్టం తీరింది
బెజ్జూర్ మండల కేంద్రానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామానికి గతంలో సరైన రోడ్డు లేదు. మార్గమధ్యలో ఉన్న వాగుపై బ్రిడ్జి లేక వానాకాలం తీవ్ర ఇబ్బంది పడ్డం. ఇప్పుడు హై లెవెల్ బ్రిడ్జి కట్టడం, రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు. దశాబ్దాలుగా పడ్డ కష్టం ఇప్పుడు తీరింది.
- శ్రీరామ చంద్రశేఖర్, కుష్ణపల్లి, ఆసిఫాబాద్-
