వడ్ల కొనుగోళ్లలో గిరిజన కార్పొరేషన్‌..భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారంలో 71 కేంద్రాల ఏర్పాటు

వడ్ల కొనుగోళ్లలో గిరిజన కార్పొరేషన్‌..భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారంలో 71 కేంద్రాల ఏర్పాటు
  • గత నెల రోజుల నుంచి ఐటీడీఏల్లో కొనుగోళ్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి, కొనుగోళ్లు చేస్తున్నారు. వీటితో పాటు గిరిజన సంక్షేమ శాఖకు చెందిన జీసీసీ (గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్) కూడా గత 8 ఏండ్ల నుంచి గిరిజనులు ఎక్కువున్న జిల్లాలు అయిన ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్ ఏజెన్సీ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

ఈ మూడు ఐటీడీఏల పరిధిలో జీసీసీకి 71 వడ్ల కొనుగోలు కేంద్రాలను కేటాయించగా, భద్రాచలంలో 35, ఏటూరు నాగారంలో 29, ఉట్నూరులో 7 ఉన్నాయి. ఏటూరు నాగారం పరిధిలో మంత్రి సీతక్క, భద్రాచలంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వీటిని ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో గత నెల రోజుల నుంచి వడ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయి. 

15 రోజుల కింద ప్రారంభమైన వడ్ల కొనుగోళ్లు.. వచ్చే ఏడాది జనవరి వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు భద్రాచలంలో 2,200 క్వింటాళ్లు, ఏటూరు నాగారంలో 2,400, ఉట్నూరు పరిధిలో 429 క్వింటాళ్ల వడ్లు కొన్నట్లు జీసీసీ జనరల్ మేనేజర్ సీతారాం నాయక్ తెలిపారు. క్వింటాకు రూ.2,300తో పాటు రూ.500 బోనస్‌ను రైతులకు అదనంగా చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం క్వింటాకు 2 శాతం కమిషన్‌ను జీసీసీకి  చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వం జీసీసీకి కొనుగోలు కేంద్రాలనుకేటాయించిందని తెలిపారు.