- ఇందుకోసం స్థానిక గిరిజనులకు శిక్షణ ఇస్తం
- మంత్రి కొండా సురేఖ వెల్లడి
- అటవీ శాఖ అధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు తగ్గించేందుకు స్థానిక గిరిజనులకు శిక్షణ ఇస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అటవీ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడకూడదని అటవీ శాఖ అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎకో టూరిజం డెవలప్ చేసి విదేశీయులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం అటవీ, టూరిజం, పరిశ్రమల శాఖలతో సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శనివారం సెక్రటేరియెట్ లోని తన చాంబర్లో మంత్రి ‘తెలంగాణ హరిత నిధి’ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. హరిత నిధి వినియోగంపై చర్చించారు. అటవీ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాల నివారణపై చర్చించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవలంబిస్తున్న విధానాలపై మంత్రి ఆరా తీశారు.
హరిత నిధి కింద నర్సరీల పెంపకం (గంధపు చెక్క, వెదురు, టేకు), మౌలిక వసతులు కల్పించడంతోపాటు 26 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రికి అధికారులు వివరించారు. నాగార్జున సాగర్‌లో వన్యప్రాణుల నిర్వహణ, నారాయణపేటలో బ్లాక్‌బక్ రెస్క్యూ, పునరావాస కేంద్రం ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
‘అరణ్యకము’ పుస్తకం ఆవిష్కకరణ
అడవుల విశిష్టతను తెలిపే ‘అరణ్యకము’ పుస్తకాన్ని మంత్రి సురేఖ ఆవిష్కరించారు.అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, పీసీసీఎఫ్ సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
