హైదరాబాద్ టు కరీంనగర్ రూ. 320
ఇప్పుడున్న ఆర్టీసీ టికెట్ చార్జీలకు అదనంగా ప్రతి కిలో మీటర్‌కు 75 పైసల చొప్పున చార్జీలు పెంచాలని ప్రైవేటు ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ లెక్కన హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు ప్రైవేటు బస్సులో వెళ్లాలంటే సుమారు రూ. 322 దాకా చెల్లించాల్సి ఉంటుంది. 165 కిలోమీటర్ల దూరం గల ఈ రూట్లో ప్రస్తుతం ఆర్టీసీ చార్జి రూ. 198. ప్రైవేటు ఆపరేటర్ల కండీషన్లకు ఒప్పుకొని కిలో మీటర్‌కు అదనంగా 75 పైసలు పెంచితే.. హైదరాబాద్ టు కరీంనగర్ టికెట్ ధర మరో రూ. 124 పెరుగుతుంది.
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటు బస్సు ఆపరేటర్లు షరతుల మీద షరతులు పెడుతున్నారు. తాము చెప్పినట్టు నిబంధనలు లేకపోతే దరఖాస్తు చేసుకోలేమని అంటున్నారు. ఇటీవల రాష్ట్ర కేబినెట్ 5,100 ప్రైవేటు బస్సుల పర్మిట్‌కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై విధివిధానాలు తయారు చేసే బాధ్యతను రవాణా శాఖ అధికారులకు సీఎం అప్పగించారు. ఏ ఏ రూట్లలో ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వాలో ఇప్పటికే అధికారులు ఫైనల్ చేశారు. తొలి విడతలో సుమారు 1,200 బస్సులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చే ముందుగా ప్రైవేటు బస్ ఆపరేటర్లతో మాట్లాడాలని రవాణా శాఖ అధికారులకు ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు తెలిసింది. దీంతో కొందరు సీనియర్ ట్రాన్స్ పోర్టు అధికారులు వారం రోజులుగా ప్రైవేటు బస్ ఆపరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆపరేటర్ల కండిషన్లు చూసి వారు అవాక్కవుతున్నారు. ప్రధానంగా చార్జీల విషయంలో ఆపరేటర్లు పట్టువీడటం లేదు.
ప్రస్తుత చార్జీలకు నడపలేం
ప్రస్తుతం ఆర్టీసీ వసూలు చేస్తున్న టికెట్ చార్జీలకు బస్సులు నడపలేమని ప్రైవేటు ఆపరేటర్లు తేల్చిచెప్తున్నట్లు తెలిసింది. ఉదాహరణకు హైదారాబాద్- – కరీంనగర్ రూట్ లో ఆర్టీసీ టికెట్ చార్జీ రూ. 198 ఉంది. అదే కాంట్రాక్ట్ క్యారియర్ కింద అనుమతి తీసుకుని బస్సులు నడుపుతున్న సంస్థలు రూ. 350 వసూలు చేస్తున్నాయి. ఇక ముందు ఆ రూట్ ను అనుమతి తీసుకుని ఆర్టీసీ వసూలు చేసిన చార్జీకే బస్సును నడపాలంటే తమ వల్ల కాదని ప్రైవేటు ఆపరేటర్లు చేతులెత్తేస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఆర్టీసీ చార్జీలకే బస్సు నడిపితే ఒక్కో కిలో మీటర్ కు రూ. 43 భారం పడుతుందని అంటున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు ఒక ట్రిప్ బస్ నడిపితే ఖర్చు సుమారు రూ. 7,000 అవుతోంది. ప్రస్తుత ఆర్టీసీ టికెట్ చార్జీల మేరకు ఆ రూట్లో ఆదాయం సుమారు రూ. 6,200 వస్తోంది. అవే చార్జీలతో తాము బస్సులను నడిపితే లాభాల మాట అటుంచి తిరిగి జేబులో నుంచే రూ. 800 పెట్టుకోవాల్సి వస్తుందని ప్రైవేటు ఆపరేటర్లు అంటున్నారు.
చార్జీలు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలి
ప్రైవేటుగా బస్సులు నడిపించాలంటే టికెట్ చార్జీలుపెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని మెజార్టీ ఆపరేటర్లు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. చార్జీలు పెంచకపోతే దరఖాస్తు చేసుకునేది లేదని వాళ్లు అధికారులతో అంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కొన్ని రోజుల తర్వాత చార్జీలు పెంచుకునే వెసులుబాటు ఇస్తామంటే అది కూడా అధికారికంగా నోటిఫికేషన్ లో ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇప్పుడున్న ఆర్టీసీ చార్జీలకు అదనంగా ప్రతి కిలోమీటర్‌కు 75 పైసలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

