ఓయూ అనుబంధ కాలేజీల్లో పరిస్థితి ఆగమాగం

ఓయూ అనుబంధ కాలేజీల్లో పరిస్థితి ఆగమాగం

రాష్ట్రంలో ఉస్మానియా వర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న కాలేజీల పరిస్థితి దారుణంగా ఉంది. ఓయూకి వెన్నుదన్నుగా ఉన్న సికింద్రాబాద్ పీజీ కాలేజ్, నిజాం కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజీలు నిధుల్లేక అవస్థలు పడుతున్నాయి. దీంతో ఫ్యాకల్టీకి, ఇతర సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఎదురైంది. అటు స్టూడెంట్స్ కు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ రావడం లేదు.

వర్సిటీలు, కాలేజీల్లో పరిస్థితి ఆగమాగం

రాష్ట్రంలో ప్రభుత్వ వర్సిటీలు, కాలేజీల్లో పరిస్థితి ఆగమాగంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఓయూ, దాని అనుబంధ కాలేజీల్లో ఉన్నత విద్య కోసం వస్తుంటారు. వీరికి స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఉపాధి కల్పన, పరిశోధనలు, క్రీడా సాంస్కృతిక రంగాలతో పాటుగా వివిధ విభాగాల్లో ఎంతో మంది మేధావులు, నిపుణులను అందించిన ఈ కాలేజీలు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కాలేజీల్లో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చెప్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ అధ్యాపకులకు, ఇతర సిబ్బందికి టైంకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల నిర్వహణలో ఇబ్బంది

అధ్యాపకులు, విద్యార్థులతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను నడిపే పరిస్థితుల్లో కూడా కాలేజీలు లేవని విద్యావేత్తలు అంటున్నారు. కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, ఇతర పరిస్థితులపై.. కొద్ది రోజుల క్రితం ఓయూ వీసీ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలోని ప్రిన్సిపల్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల నిర్వహణ, ఆర్థికంగా ఎదరవుతున్న సమస్యలపై రిపోర్ట్ ఇచ్చారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల నిర్వహణ ఇబ్బందిగా ఉందని ప్రిన్సిపల్స్ చెప్పినా.. ఉన్నతాధికారులు ఏమీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. సికింద్రాబాద్ పీజీ కాలేజ్, నిజాం కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్స్ విడుదల కాకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని కాలేజీ అధికారులు అంటున్నారు.

ప్రభుత్వంపై విద్యార్థుల అగ్రహం

ఓయూతో పాటు వాటి అనుబంధ కాలేజీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాం కాలేజీ విద్యార్థులు హాస్టల్ కోసం పోరాడి సాధించుకున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ పీజీ కాలేజీ స్టూడెంట్స్ కూడా హాస్టల్ కోసం ఆందోళనలు చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు.. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని విద్యార్థులు మండిపడున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వర్సిటీలతో పాటు వాటి అనుబంధ కాలేజీలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఆశలతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తమకు.. ఇక్కడ సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అకాడమిక్ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నా నిధులివ్వడం లేదని విద్యావేత్తలు అంటున్నారు.