తెలంగాణ వర్సిటీలో ఏడాది అవుతున్నా ఈసీ మీటింగ్​ పెడ్తలేదు

తెలంగాణ వర్సిటీలో ఏడాది అవుతున్నా ఈసీ మీటింగ్​ పెడ్తలేదు

నిజామాబాద్, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో ఆఫీసర్లు, పాలకమండలి వ్యవహారం రోజురోజుకూ ప్రశ్నార్థకం అవుతోంది. సమన్వయం లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు.  ఏడాది అవుతున్నా  ఈసీ మీటింగ్​ పెట్టడం లేదు. దీంతో వర్సిటీ సమస్యలపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. తరచూ వివాదాల్లోకి ఎక్కుతున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. కానీ సర్కార్​ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో  అనుమానాలువ్యక్తం అవుతున్నాయని విద్యార్థులు అంటున్నారు.

మళ్లీ వివాదాల్లో... 

తెలంగాణ వర్సిటీలో ఔట్ సోర్సింగ్​ స్టాఫ్​ నియామకాల్లో అక్రమాలపై చర్యలు, ఈ టెండర్లు పిలవకుండానే కొనుగోళ్లు, మూడు క్యాంపస్​ లు ఉండగా ఇంటర్నేషనల్​ సెమినార్​ ను ప్రైవేట్​ హోటల్​ లో నిర్వహణ, సావనీర్​ పేరుతో ప్రైవేట్​ కళాశాల యాడ్​ డబ్బుల వసూళ్లు, గతేడాది ఈసీ మీటింగ్​ లో తీర్మానం లేకుండా నియమకాలు చేపట్టరాదని నిర్ణయించినా మళ్లీ 25 మంది సిబ్బంది నియమకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈసీ మీటింగ్​ పెడితే ఈ అక్రమాలు బయటపడుతాయని మీటింగ్​పై అధికారులు నోరెత్తడం లేదని తెలుస్తోంది.  ఔట్ సోర్సింగ్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొన్న  ఇన్ చార్జ్​  రిజిస్ట్రార్ కనకయ్యను పదవి నుండి తొలగించి నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటివరకు తీసుకున్న చర్యలు వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి  ఉన్నత విద్యామండలి మీటింగ్ గతేడాది నవంబర్​ 27న జరిగింది. 2021వ సంవత్సరం అక్టోబర్​ నెలలో హైదరాబాద్​, డిచ్​ పల్లి లో  జరిగిన ఈసీ, ఉన్నత విద్యామండలి మీటింగ్ లో అక్రమ ప్రమోషన్ లు రద్దు చేయాలని పాలకమండలి సభ్యులు డిమాండ్ చేశారు. అది రసాభాసగా మారడంతో అక్టోబర్ 30 న మళ్లీ   జరిపారు. ఈ మీటింగ్ లో వర్సిటీ లో అక్రమ పోస్టింగ్​ లను రద్దు చేయాలని ఈసీ సభ్యులు పట్టుబట్టారు. అసలు ఎలాంటి నియామకాలు జరుగలేవని వర్సిటీ ఆఫీసర్లు తేల్చిచెప్పడంతో తీవ్రస్థాయిలో  వాదనలు జరిగాయి.  

సమస్యలు పరిష్కరించాలె

వర్సిటీలో  సమస్యలు పరిష్కరించడం లేదు.  ఈసీ తీర్మానం లేకుండా సిబ్బందిని నియమించారు.   వర్సిటీ ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్రు.  3 నెలలకొకసారి మీటింగ్​ జరపాల్సి ఉన్నా ఎడాదిగా నిర్వహిస్తలేరు. 

- వేణు జిల్లా ప్రెసిడెంట్ ఎన్​ ఎస్​ యూఐ

 చర్యలు తీసుకోవాలె

వర్సిటీలో అక్రమాలపై సర్కార్​ చర్యలు చేపట్టాలే. విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదు. ఉన్నత విద్యామండలి నివేదిక ఇచ్చినా చర్యల్లో జాప్యమైతుంది.  వర్సిటీ సమస్యలపై ఈసీ మీటింగ్​ జరపడంలేదు. వీసీ, ఆఫీసర్లు నియంతల్లా వ్యవహరిస్తున్రు.

- నవీన్​ ఏబీవీపీ రాష్ట్ర ప్రతినిధి