తెలంగాణ వర్సిటీ వివాదం..గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు

తెలంగాణ వర్సిటీ వివాదం..గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు
  •     సెక్యూరిటీకి టీయూ వీసీ  తాజా ఆదేశం 
  •     మరో గదిలో కూర్చున్న యాదగిరి 
  •     తనపై నియమించిన విచారణ కమిటీకి ఫైళ్లు ఇవ్వొద్దన్న వైస్ ​చాన్సలర్​
  •     వేసవి సెలవులు రద్దు చేసిన రవీందర్​ గుప్తా
  •     తెలంగాణ యూనివర్సిటీలో ఆసక్తికరంగా మారిన పరిణామాలు


నిజామాబాద్,  వెలుగు:  అంతా ఓకే అయ్యిందనుకుంటున్న తరుణంలో టీయూ వర్సిటీ వివాదం మరో మలుపు తిరిగింది. వీసీ రవీందర్​ ఓయూకు చెందిన ప్రొఫెసర్​ నిర్మలాదేవిని రిజిస్ట్రార్​గా నియమించడం, దాన్ని రద్దు చేస్తూ ఈసీ మళ్లీ యాదగిరినే కొనసాగిస్తూ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రిజిస్ట్రార్​ కుర్చీలో ఎవరూ కూర్చోవడానికి వీల్లేదని, అప్పటిదాకా ఆ రూమ్​ తాళం తీయొద్దని వీసీ సోమవారం సెక్యూరిటీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈసీ సభ్యులు విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లగా...మరోవైపు బీజేపీ నాయకులు, వర్సిటీ స్టూడెంట్లు గవర్నర్​ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు.  

ఉదయం ఎనిమిదింటికే వచ్చిన వీసీ

ప్రొఫెసర్​ యాదగిరిని రిజిస్ట్రార్ గా అంగీకరించని వీసీ రవీందర్​ఈనెల 5వ తేదీ తర్వాత జరిగిన పరిణామాలకు కాస్త తగ్గినట్టు కనబడ్డారు. ఆయన అపాయింట్ ​చేసిన నిర్మలాదేవి తిరిగి ఓయూలో చేరడంతో  కాస్త వెనక్కి తగ్గినట్టే అనిపించారు. సిబ్బంది జీతభత్యాల చెక్కుల డ్రాకు అంగీకరించి చెల్లింపులు ముగిసేదాకా సైలెన్స్​గానే ఉన్నారు. 12వ తేదీ నాటి మరో ఈసీ సమావేశానికి వెళ్తానని ప్రకటించారు. ఆయన గైర్హాజర్ ​కావడంతో మళ్లీ ఏం జరుగుతుందా అన్న అనుమానాలు కలిగాయి. వాటిని నిజం చేస్తూ సోమవారం ఉదయం 8 గంటలకే వర్సిటీకి వచ్చిన వీసీ రిజిస్ట్రార్​ఆఫీసు రూమ్​తాళం తీయొద్దని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు.  

చేసింది తీర్మానమే.. ఆర్డర్​ ఏది : వీసీ

రిజిస్ట్రార్​గా యాదగిరిని నియమించాలని ఈసీ మీటింగ్​లో తీర్మానం మాత్రమే చేశారని, నియామక ఆర్డర్​ ఇవ్వలేదని వీసీ స్పష్టం చేశారు. ఇప్పటికీ తాను ఆ కుర్చీ ఖాళీగానే ఉన్నట్టు భావిస్తున్నానని చెప్పారు. ఎవరూ అపాయింట్​ చేయలేదు కాబట్టి గదిని ఓపెన్ ​చేయలేదన్నారు. గత నెల 19వ తేదీన ఈసీ మీటింగ్​ నిర్ణయాల అమలుపై హైకోర్టు 
మధ్యంతర స్టే ఇచ్చినందున యాదగిరి నియామకం చెల్లదన్నారు. ఖాళీగా ఉన్న రిజిస్ట్రార్ ​బాధ్యతలను టీయూకు చెందిన వ్యక్తికే అప్పగిస్తామన్నారు. అంతకుముందు వర్సిటీకి వచ్చిన యాదగిరి లాక్​ ఉన్న రూమ్​ కు వెళ్లకుండా మరో రూమ్​లో వెళ్లి కూర్చున్నారు.  

వర్సిటీ సెలవులు రద్దు

ఈనెల 30వ తేదీ వరకు యూనివర్సిటీకి ప్రకటించిన వేసవి సెలవులను విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రద్దు చేస్తున్నట్టు వీసీ తెలిపారు. ఆయా కోర్సుల సెమిస్టర్​పరీక్షలతో పాటు ప్రభుత్వం ప్రకటించిన పోటీ పరీక్షలకు వారు హాజరుకావాల్సి ఉందన్నారు. దీనికోసం ఈ నెల 18వ తేదీ నుంచి వర్సిటీ పనిచేస్తుందన్నారు. దానికి ముందు రోజు సిబ్బందితో మీటింగ్​ నిర్వహిస్తామన్నారు. ఎప్పుడో నియమించిన స్టాఫ్ ​సరిపోవడంలేదని, 74 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సిన చోట 35 మందే ఉన్నారన్నారు. భిక్కనూర్,సారంగాపూర్​లో స్టాఫ్​ సమస్య ఎక్కువగా ఉందన్నారు. హాస్టల్​లోనూ ఇబ్బందులున్నాయని, పుస్తకాలు కూడా కొనాల్సిఉందన్నారు.


కమిటీ సభ్యులకు రికార్డులివ్వొద్దు 

రవీందర్ గుప్తా వీసీగా చార్జి తీసుకున్నాక ఈసీ సభ్యుల ఆమోదం లేకుండా తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విచారించడానికి త్రీమెన్​ కమిటీని నియమించారు. ఆ కమిటీ సభ్యులు ఆఫీసు రికార్డులు పరిశీలించే వీలులేకుండా వీసీ సోమవారం సర్క్యులర్​ జారీ చేశారు. తన ఆమోదం లేకుండా ఎవరికీ ఫైళ్లు చూపొద్దని వర్సిటీలోని శాఖలకు లెటర్​ పంపారు. 

గవర్నర్​,  ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి ఫిర్యాదు   

రిజిస్ట్రార్​ ఆఫీసుకు తాళం వేసిన విషయాన్ని ఈసీ సభ్యులు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు వర్సిటీలో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని బీజేపీ లీడర్ దినేశ్​ కులాచారి, వర్సిటీ స్టూడెంట్స్​ గజేందర్​, సాయికుమార్​, లక్ష్మీనారాయణ,  డిచ్​పల్లి వైస్​ ఎంపీపీ శ్యామ్​ రావు, రిటైర్డ్​ ప్రొఫెసర్​ విద్యాసాగర్​ రావు గవర్నర్​ తమిళి ​సైని కలిసి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల భవిష్యత్​ దెబ్బతినే ప్రమాదం ఉందని, అయినా సర్కారు స్పందించడం లేదన్నారు.  ఛాన్సలర్​ హోదాలో చర్యలు తీసుకోవాలని కోరారు.