సెప్టెంబర్ 25 నాటికి.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. వారమంతా వానలే..!

సెప్టెంబర్ 25 నాటికి.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. వారమంతా వానలే..!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా వింత వాతావరణం నెలకొంటున్నది. పొద్దంతా ఎండ, ఉక్కపోత ఉంటూ.. సాయంత్రం కాగానే వర్షం స్టార్ట్ అవుతోంది. ఈ వర్షం అర్ధరాత్రి వరకు కొనసాగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లా రాజపేట మండలం పాముకుంటలో 11.3 సెం.మీ, హైదరాబాద్ లోని షేక్ పేటలో 10.1 సెం.మీ., ఖైరతాబాద్, జనగామ, కొత్తగూడెం, సిద్దిపేట, ములుగు జిల్లాల్లో 9 సెం.మీ.కు పైగా వర్షం కురిసిందని వాతావారణ కేంద్రం వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే నాగులు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. యాదాద్రి భువనగిరి, మెదక్, జనగామ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రికార్డయ్యాయి. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. 

25 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 
బంగాళాఖాతంలో ఈ నెల 25 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 26 నాటికి అది వాయుగుండంగా బలపడి, 27 నాటికి దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర కోస్ట్ తీరాన్ని దాటే సూచనలు ఉన్నాయని పేర్కొంది. రాబోయే 7 రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది.