Good News : తెలంగాణ అంతా రుతుపవనాలు.. మూడు జిల్లాల్లోకి విస్తరించేందుకు నాలుగు రోజుల సమయం

Good News : తెలంగాణ అంతా రుతుపవనాలు.. మూడు జిల్లాల్లోకి విస్తరించేందుకు నాలుగు రోజుల సమయం
  •     ఈ సారి తొమ్మిది రోజుల్లోనే విస్తరించిన రుతుపవనాలు
  •     కొంత ఆలస్యంగా మూడు ఉత్తరాది జిల్లాల్లోకి ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు : నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. రాష్ట్రంలోకి ఈ నెల 10న రుతుపవనాలు ఎంటరవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసినా..‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3వ తేదీ నాటికే రాష్ట్రంలోకి వచ్చేశాయి. 8వ తేదీ నాటికి ఓ మూడు జిల్లాలు మినహా రాష్ట్రమంతా విస్తరించాయి. ఆ మూడు జిల్లాల్లోకి రుతుపవనాలు విస్తరించేందుకు దాదాపు నాలుగు రోజుల సమయం పట్టింది.

అక్కడి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఆయా జిల్లాల్లోకి రుతుపవనాల విస్తరణ కాస్త ఆలస్యమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా తొమ్మిది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో ఇక విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

మండిన ఉత్తరాది జిల్లాలు 

రుతుపవనాల విస్తరణ ఉత్తరాది జిల్లాల్లో కొంత ఆలస్యం కావడంతో ఆ జిల్లాలు  ఎండలతో మండాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో టెంపరేచర్లు ఎక్కువగా నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ మూడు జిల్లాల్లోనూ 43 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా రికార్డ్​నమోదయ్యాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వనపర్తి జిల్లాలోని దగడలో అత్యల్పంగా 31.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది.