హైదరాబాద్ సిటీలో వాన.. అమీర్పేట్ వైపు గానీ వెళుతున్నారా..? లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..

హైదరాబాద్ సిటీలో వాన.. అమీర్పేట్ వైపు గానీ వెళుతున్నారా..? లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..

హైదరాబాద్: భాగ్య నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోయినప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. క్యూమిలో నింబస్ మేఘాలు కమ్ముకోవడంతో సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరో  రెండు మూడు గంటల పాటు నగరానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది.

హైదరాబాద్ నగరంలోని సౌత్, వెస్ట్ సిటీలో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో GHMC, హైడ్రా, మాన్సూన్, DRF బృందాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రస్తుతం అమీర్ పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగం బజార్, సుల్తాన్ బజార్, కుత్బుల్లాపూర్, దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట, బహదూర్ పల్లి, సూరారం, కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అమీర్ పేట్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.

కోఠి, మొహింజాహి మార్కెట్, నాంపల్లి  ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సిటీ శివారులో కూడా వర్షం కురిసింది. రాజేంద్రనగర్ మైలర్ దేవ్ పల్లి, అత్తాపూర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ, బండ్లగూడ జాగిర్, కిస్మత్ పూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

నేటి నుంచి మరో నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవన ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం, తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30- నుంచి 40 కి. మీ)తో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో  రేపు (శుక్రవారం ఆగస్ట్ 7) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుంచి -40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.