పవర్​లూం బంద్​ పాటిస్తున్న నేత కార్మికులు

పవర్​లూం బంద్​ పాటిస్తున్న నేత కార్మికులు
  • బడి బట్టలు నేస్తే..గిట్టుబాటు కావట్లే
  • రేటు పెంచాలని వేడుకోలు
  • మా పరిధిలో లేదంటున్న చేనేత జౌళిశాఖ అధికారులు
  • నేడు పవర్లూం బంద్కు వర్కర్స్ యూనియన్ పిలుపు

రాజన్నసిరిసిల్ల: నిన్న మొన్నటి వరకు సర్కారుఆర్డరంటేనే సంతోషపడే సిరిసిల్ల నేతన్నలు ఒక్కసారిగా డీలా పడుతున్నరు. కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చినా మేం చేయలేం అంటూ చేతులెత్తేస్తున్నరు. శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. పెరిగిన ముడి సరుకులకు అనుగుణంగా ఉత్పత్తి ధర పెంచడం లేదని సిరిసిల్ల నేతన్నలు వాపోతున్నారు. కొవిడ్19 కారణంగా నూలు రేట్విపరీతంగా పెరగడం నేతన్నలకు కష్టాలను తెచ్చిపెడుతోంది. సర్కార్ పెద్దమనసుతో పెరిగిన యారన్ రేట్లకు అనుగుణంగా మీటరుకు రేటు పెంచాలని పేర్కొంటూ నెల రోజులుగా సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) ఆర్డర్లు తీసుకోకుండా దూరంగా ఉంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ఆర్డర్లపైనా ప్రభావం పడనుంది.

కోటి మీటర్ల ఆర్డర్

ఏటా బతుకమ్మ చీరల మాదిరిగానే ఎస్ఎస్ఏ ఆర్డర్లు ప్రభుత్వం ఇస్తుంది. టెస్కో ద్వారా ఈ ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చి బట్ట తయారు చేయిస్తోంది. 2021–22 సంవత్సరానికి గాను ఎస్ఎస్ఏ ద్వారా రాష్ట్రంలోని 23.29 లక్షల స్టూడెంట్లకు కోటి మీటర్ల బట్ట కావాలంటూ రూ.52 కోట్ల విలువైన ఆర్డర్లను ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఇచ్చింది. కానీ సిరిసిల్ల నేతన్నలు ఈ ఆర్డర్లు తీసుకోకుండా దూరంగా ఉన్నారు. కొవిడ్ కారణంగా యారన్కంపెనీలు ముడి సరకుల ధరలు 30 శాతానికి పైగా పెంచాయని, పాత రేట్ల ప్రకారం ఆర్డర్లు ఇస్తే కూలి కూడా పడదని పేర్కొంటున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి మీటర్కు రేటు పెంచాలని చేనేత జౌళిశాఖ డైరెక్టర్ శైలజ రామయ్యార్కు విజ్ఞప్తి చేశారు. నెల రోజులుగా చర్చలు జరుపుతున్నా లాభం లేకుండా పోయింది. ఈ రేట్ల విషయం ప్రభుత్వ పరిధిలోనిదని, తామేం చేయలేమని చేనేత జౌళిశాఖ అధికారులు పేర్కొనడంతో రేటు పెంచేంత వరకు ఎస్ఎస్ఏ ఆర్డర్లు ఎవరూ తీసుకోవద్దని చేనేత సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 15లోపు సర్వశిక్ష అభియాన్ ఆర్డర్లు పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క సంఘం కూడా వర్క్ఆర్డర్ తీసుకోకపోవడంతో ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేడు వస్త్ర పరిశ్రమ బంద్

పెరిగిన ముడిసరుకుల ధరలకు అనుగుణంగా బతుకమ్మ, ఇతర ఆర్డర్ల రేటు పెంచాలని పేర్కొంటూ రాజన్న సిరిసిల్ల పవర్లూం వర్కర్స్యూనియన్ సోమవారం బంద్కు పిలుపునిచ్చింది. 8న జరిగే ఈ బంద్లో ఆసాములు మొత్తం పాల్గొనాలని పేర్కొంది. పాత రేట్ల ప్రకారమైతే ఆసాములు తీవ్రంగా నష్టపోతారని  సంఘం జిల్లా అధ్యక్షులు కోడం రమణ అన్నారు. రేట్లు పెంచడంతోపాటు సాంచెల అప్గ్రేడేషన్కు కూడా సర్కార్ సాయం అందించాలని డిమాండ్ చేశారు.

రేట్లు పెంచి ఆదుకోవాలి

నూలు రేట్లు విపరీతంగా పెరిగాయి. గత రేట్లుకు, ప్రస్తుతం 30 శాతానికి పైగా తేడా ఉంది. ప్రభుత్వం విచారణ జరిపి పెరిగిన రేట్లకు అనుగుణంగా మాకు ఇస్తున్న ఆర్డర్లకు సంబంధించి బట్టకు రేటు పెంచాలి. మీటర్ రేటు పెంచి ఇస్తే కార్మికులను, ఆసాములను ఆదుకున్నవారవుతారు. ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా రేట్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలి.– చిమ్మని ప్రకాశ్, సమన్వయ కమిటీ సభ్యుడు, సిరిసిల్ల.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

రేట్లు పెంచాలని ఎస్ఎస్ఐ, మ్యాక్ సంఘాల వారు మాకు విన్నవించారు. రేట్లు పెంచడం నా పరిధిలో లేదు. అందుకే మా పైఅధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేం ముందుకు వెళ్తాం. సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతున్నా. రేటు పెంపు విషయంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది.–తస్లీమా, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, టెక్స్టైల్​.