హైదరాబాద్, వెలుగు: నిరుపేద మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్న వ్యవహారంలో ఆస్పత్రులు, ల్యాబ్‌లపై వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకోకపోవడం పట్ల రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంటర్లపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మహిళా కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. బాధిత మహిళలను మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పరామర్శించిన సమయంలో బాధితులు కీలక వివరాలు వెల్లడించారు.
ప్రధానంగా ఇందిరా ఐవీఎఫ్ సెంటర్, నర్మద ఫెర్టిలిటీ సెంటర్, ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్, సద్గురు ఏఆర్టీ సెంటర్, పద్మజ ఫెర్టిలిటీ సెంటర్లతోపాటు డాక్టర్ హుస్సేన్ పేరును బాధితులు ప్రస్తావించి ఫిర్యాదు చేశారని మహిళా కమిషన్ తెలిపింది. అయినప్పటికీ ఇప్పటివరకు డాక్టర్ హుస్సేన్ ఆచూకీ కనిపెట్టకపోవడం, కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితులపై కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
