 
                                    - డిసెంబర్ 31 కల్లా అందుబాటులోకి వరంగల్, సనత్ నగర్ హాస్పిటల్స్
- వచ్చే ఏడాది మార్చిలో అల్వాల్, జూన్‌లో ఎల్బీనగర్ టిమ్స్, డిసెంబర్‌లో నిమ్స్ హాస్పిటల్
- డెడ్‌లైన్ పెట్టుకొని ముందుకెళ్తున్న ఆర్అండ్బీ అధికారులు
- పూర్తయితే పేదలకు అందుబాటులోకి అత్యాధునిక వైద్యసేవలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న హాస్పిటల్స్ బిల్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 31 కల్లా వరంగల్, సనత్‌నగర్ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో అల్వాల్, జూన్ లో ఎల్బీనగర్, డిసెంబర్‌లో నిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ పనులు కంప్లీట్ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది.
ఈ దవాఖానలు ప్రారంభమైతే రాష్ట్ర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. నిరుపేద కుటుంబాలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి.
డిసెంబర్ 31 నాటికి సిద్దం చేసేలా..
ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి వరంగల్, సనత్‌గర్ హాస్పిటల్స్ బిల్డింగ్ నిర్మాణాలు పూర్తై.. ప్రారంభానికి సిద్దం కానున్నాయి. వరంగల్ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్‌ను వరంగల్ పట్టణంలో కాకతీయ మెడికల్ కాలేజీ పక్కన 57 ఎకరాల విస్తీర్ణంలో 24 అంతస్తులతో నిర్మిస్తున్నారు. రూ.1,100 కోట్లతో పనులు మొదలుపెట్టగా.. ప్రస్తుతానికి రూ.1,371 కోట్లకు బడ్జెట్ పెరిగింది. మొత్తం 1,720 బెడ్ల సామర్థ్యం కలిగి, 35 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లతో ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించడానికి వీటిని రెడీ చేస్తున్నారు.
ఈ హాస్పిటల్ ప్రారంభం అయితే ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కూడా వీలవుతుంది. ఎల్ అండ్ టీ కంపెనీ ఈ పనులు నిర్వహిస్తున్నది. 2021లో పనులు స్టార్ట్ చేశారు. నవంబర్ 2023 నాటికి పూర్తి కావాల్సి ఉండగా.. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పనులు చాలా స్లోగా జరిగాయి. కొత్త సర్కారు వచ్చిన తర్వాత పనుల్లో వేగం పెరిగింది.
53 ఎకరాల విస్తీర్ణంలో సనత్‌నగర్ హాస్పిటల్
సనత్‌నగర్ హాస్పిటల్ 53 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 5గా నిర్మిస్తున్నారు. మొదట రూ.882 కోట్లతో పనులు స్టార్ట్ చేయగా.. ఇప్పటికీ రూ.957 కోట్లకు బడ్జెట్ పెరిగింది. వెయ్యి బెడ్ల సామర్థ్యం కలిగిన హాస్పిటల్ పనులను మేఘా కంపెనీ నిర్వహిస్తున్నది. 2022లో పనులు స్టార్ట్ చేశారు. కార్డియాక్ కేర్, కార్డియోథోరాసిక్ సర్జరీలు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సేవలకు ప్రత్యేక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు.
ఆధునిక డయాగ్నోస్టిక్ సౌకర్యాలు, ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లు, కార్డియాలజీ, న్యూరాలజీ మొదలైనవి ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. కాగా, సనత్‌నగర్, వరంగల్ హాస్పిటల్స్ బిల్డింగ్ పనులు ప్రస్తుతానికి 90 శాతం కంప్లీట్అయ్యాయి. వరంగల్హాస్పిటల్ బిల్డింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థలకు రూ.894.93 కోట్లు, సనత్‌నగర్ హాస్పిటల్ కాంట్రాక్ట్ సంస్థలకు రూ.608.55 కోట్లు చెల్లించారు.
సివిల్ వర్క్స్ పూర్తికావడంతో ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్స్, పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఎలక్ట్రో, ఎలక్ట్రికల్‌కు సంబంధించిన కరెంట్ వైరింగ్, లిఫ్ట్‌లు, జనరేటర్ల ఏర్పాటులాంటి పనులు చేపడుతున్నారు. అలాగే మెడికల్ గ్యాస్ పైప్లైన్ల నిర్మాణం, బెడ్స్, ఫర్నీచర్ లాంటి పనులు చేస్తున్నారు. అలాగే, టీజీఎంఎస్ఐడీసీ ద్వారా మెడికల్ ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చి అమర్చుతున్నారు.
వచ్చే ఏడాదిలో అల్వాల్, ఎల్బీనగర్, నిమ్స్ హాస్పిటల్స్..
హైదరాబాద్ సిటీలో నిర్మిస్తున్న అల్వాల్, ఎల్బీ నగర్, నిమ్స్ హాస్పిటల్స్ వచ్చే ఏడాదిలో రెడీ కానున్నాయి. వెయ్యి బెడ్ల సామర్థ్యంతో 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న అల్వాల్ హాస్పిటల్ పనులు ప్రస్తుతానికి 62 శాతం కంప్లీట్ అయ్యాయి. జీ ప్లస్ 7 పద్ధతిలో రూ.897 కోట్ల వ్యయంతో 2022లో పనులు చేపట్టారు. గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంవల్ల గడువు పెరిగి.. రూ.1,046 కోట్లకు బడ్జెట్ పెరిగింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు పనులు కంప్లీట్ చేసి.. హాస్పిటల్ ప్రారంభించాలని సర్కారు భావిస్తున్నది. డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ పనులు చేపడుతున్నది. ఇప్పటివరకూ ఈ హాస్పిటల్ నిర్మాణంపై రూ.442.83 కోట్లు ఖర్చు చేశారు. వెయ్యి బెడ్స్ సామర్థ్యంతో 21 ఎకరాల విస్తీర్ణంలో ఎల్‌బీ నగర్ హాస్పిటల్ నిర్మిస్తున్నారు. జీ ప్లస్ 13 పద్ధతిలో నిర్మిస్తున్న ఈ బిల్డింగ్ వ్యయం మొదట రూ.900 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.1,001 కోట్లకు బడ్జెట్ పెరిగింది. ఈ హాస్పిటల్ పనులు కూడా గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా కంప్లీట్ కాలేదు. ఎల్ అండ్ టీ కంపెనీ ఈ పనులు చేపడుతున్నది. ఇప్పటివరకూ 40 శాతం పనులు కంప్లీట్ అయ్యాయి. రూ.273.59 కోట్లు బిల్స్ చెల్లించారు. వచ్చే ఏడాది జూన్ 30 వరకు పనులు పూర్తి చేసి హాస్పిటల్ ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
అందుబాటులోకి అత్యాధునిక వైద్య సేవలు
వరంగల్, సనత్‌నగర్ హాస్పిటల్స్ ప్రారంభమైతే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆధునిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సెంట్రలైజ్డ్ ఫార్మసీ, అడ్వాన్స్‌డ్ ల్యాబ్స్, టెలి మెడిసిన్, 24/7 ఎమర్జెన్సీ వైద్యసేవలు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉన్నాయి. యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీలు, హార్ట్ ఫెయిల్యూర్ చికిత్స, అత్యవసర కార్డియాక్ కేర్, ఐసీయూ సౌకర్యాలు అందుతాయి.
కార్డియోథోరాసిక్ సర్జరీ వాల్వ్ రిపేర్, ట్రాన్స్‌ప్లాంట్ సంబంధిత చికిత్సలు, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, మెదడు, నాడీ వ్యవస్థ సమస్యలు (స్ట్రోక్, ఎపిలెప్సీ), బ్రెయిన్ సర్జరీలు, స్పైన్ చికిత్స, అడ్వాన్స్‌డ్ ఇమేజింగ్, ఆర్థోపెడిక్స్ సంబంధించిన జాయింట్ రిప్లేస్‌మెంట్, స్పోర్ట్స్ మెడిసిన్, ఫ్రాక్చర్ చికిత్స, రోబోటిక్ సర్జరీ సౌకర్యాలు అందుతాయి. అలాగే నెఫ్రాలజీ, యూరాలజీకి సంబంధించిన చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. ఎమర్జెన్సీ, ట్రామా కేర్ 24/7 అత్యవసర సేవలు, ట్రామా ఐసీయూ అంబులెన్స్ సర్వీస్, జనరల్ మెడిసిన్, సర్జరీ, సాధారణ చికిత్సలు, ఓపీడీ సేవలు ప్రజలకు అందుతాయి.
2వేల బెడ్స్‌తో నిమ్స్..
నిమ్స్ హాస్పిటల్‌ను 32 ఎకరాల విస్తీర్ణంలో 2,020 బెడ్స్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. జీ ప్లస్ 14 పద్ధతిలో రూ.1,698 కోట్ల బడ్జెట్‌తో 2023లో పనులు మొదలుపెట్టారు. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఈ పనులు నిర్వహిస్తున్నది. 38 నెలల గడువులోగా పనులు పూర్తిచేయాల్సి ఉండగా.. ప్రస్తుతానికి 28 శాతం వర్క్ కంప్లీట్ అయ్యింది. కాంట్రాక్ట్ సంస్థలకు రూ.390.54 కోట్లు చెల్లించారు. 2026 డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి చేసి, హాస్పిటల్ ప్రారంభించాలని సర్కారు భావిస్తున్నది.
జనవరిలో ఆస్పత్రులు ప్రారంభం
వరంగల్ సూపర్ స్పెషాలిటీ, సనత్ నగర్ హాస్పిటల్స్ భవన నిర్మాణాలను డిసెంబర్ 31 లోగా పూర్తిచేస్తాం. ఇటీవల  టిమ్స్ హాస్పిటల్స్ బిల్డింగ్ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన ఆదేశాల ప్రకారం ఈ రెండు హాస్పిటల్స్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మేరకు పనులను వేగవంతం చేశాం. అల్వాల్, ఎల్బీ నగర్, నిమ్స్ హాస్పిటల్స్ బిల్డింగ్ నిర్మాణ పనులను కూడా గడువులోగా పూర్తి చేస్తాం.
- రాజేశ్వర్‌రెడ్డి, బిల్డింగ్స్ విభాగం ఇన్‌చార్జి సీఈ, ఆర్ అండ్ బీ శాఖ, హైదరాబాద్

 
         
                     
                     
                    